
లాహోర్, 2 సెప్టెంబరు 2026: పాకిస్తాన్లోని రావల్పిండి జైలులో శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు, ఆయన భార్య బుష్రా బీబీ (Bushra Bibi) కి పాక్ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
వారిద్దరినీ ఒంటరిగా, అందరికీ దూరంగా ఉంచకూడదని పాక్ హైకోర్టు జైలు అధికారులను ఆదేశించింది. అంతేకాదు.. వారు జైలులో తమ పిల్లలు, బంధువులను కలవొచ్చని, పిల్లలతో ఫోన్లో మాట్లాడేందుకు కూడా అనుమతివ్వాలని కూడా కోర్టు ఆదేశించింది.
ఇమ్రాన్ ఖాన్, అతడి భార్య బుష్రా బీబీ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇమ్రాన్ 2023 నుంచి జైలులో ఉండగా, బుష్రా 2024, జనవరి నుంచి అదే జైలులో ఉంటున్నారు.
ఇమ్రాన్ ఖాన్కు మెరుగైన వైద్య సహాయం అందించాలంటూ గత ఆగష్టులో కూడా కోర్టు ఆదేశించింది. అయితే అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించి, ఆ వెంటనే తిరిగి జైలుకు తీసుకెళ్లారు.
దీంతో ఇమ్రాన్ ఖాన్, అతడి భార్య బుష్రా బీబీ విషయంలో పాక్ ప్రభుత్వం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదని, ఈ ఆదేశాలు పాటించేలా చూడాలని కోరుతూ ఇమ్రాన్ సోదరి సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది.
అయితే, అప్పట్లో ఈ పిటిషన్పై త్వరితగతిన విచారణకు స్వీకరించలేమంటూ సుప్రీంకోర్టు తెలిపింది.
మరోవైపు, వారిని కలిసేందుకు వారి పిల్లలను, కుటుంబ సభ్యులను సైతం పాక్ ప్రభుత్వం, అడియాలా జైలు అధికారులు అనుమతించడం లేదు. దీంతో వారి తరఫున ఇస్లామాబాద్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.
ఈ విషయంపై గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం జైలు అధికారులు పాటించడం లేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన ఇస్లామాబాద్ హై కోర్టు న్యాయమూర్తి ఖాదిం హుస్సేన్ సూమ్రో ఈ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
జైలు నిబంధనల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రాలను కలిసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించాలని.. అలాగే, లండన్లో ఉంటున్న వారి కొడుకులతో ఫోన్లో మాట్లాడే ఏర్పాట్లు కూడా చేయాలని సూచించారు.
అంతేకాదు, ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రాలను ఇతరులకు దూరంగా ఒంటరిగా ఉంచకూడదని, జైలులో వారికి దిన పత్రికలు, పుస్తకాలు వంటివి అందించాలని, వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని హైకోర్టు జడ్జి ఆదేశించారు.
తమ ఆదేశాలను తక్షణమే అడియాలా జైలు సూపరింటెండెంట్ పాటించాలని, అలాగే దీనిపై 15 రోజుల్లోగా ఒక నివేదికను కూడా సమర్పించాలని జడ్జి ఆదేశించారు.








