
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సుల్లో కొత్తగా ప్రత్యక్షమైన కొన్ని సూచిక బోర్డులు ప్రయాణికుల దృష్టిని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. “పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారి కోసం కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం” అని స్పష్టంగా రాసి ఉన్న ఈ సూచిక బోర్డులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ ఊహించని రీతిలో పెరిగింది. మహిళా ప్రయాణికులు విపరీతంగా పెరగడంతో, బస్సుల్లో పురుషుల కోసం కేటాయించిన ప్రత్యేక సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా పూర్తి డబ్బులు పెట్టి టికెట్ కొనుగోలు చేసే పురుష ప్రయాణికులు సుదీర్ఘ ప్రయాణాల్లో కూడా నిలబడే వెళ్లాల్సి వస్తోందనే ఆవేదన గత కొంతకాలంగా వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే ‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’ అంటూ ప్రత్యేకంగా బోర్డులు వెలియడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా మేడ్చల్, బాలానగర్ డిపోలకు చెందిన పలు ఆర్టీసీ బస్సుల్లో ఈ బోర్డులు దర్శనమిచ్చాయి. అయితే ఈ నిర్ణయం ఆర్టీసీ యాజమాన్యం అధికారికంగా తీసుకుందా లేక ప్రయాణికుల ఇబ్బందులను గమనించి స్థానిక డిపోల సిబ్బందే సొంతంగా ఏర్పాటు చేశారా అనే అంశంపై ఆర్టీసీ అధికారుల నుంచి పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
ఏది ఏమైనా, ఉచిత ప్రయాణం వల్ల టికెట్ కొనే పురుషులకు జరుగుతున్న అన్యాయంపై ఈ బోర్డులు అద్దం పడుతున్నాయని నెటిజన్లు, పురుష ప్రయాణికులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.








