
అనంతపురం: గత గురువారం వెలువడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం రాప్తాడు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. టీడీపీ నుంచి పోటీ చేసిన శ్రీరామ్ తన సమీప వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.
ఈ నేపథ్యంలో తన ఓటమిపై శ్రీరామ్ తొలిసారిగా స్పందించారు. ఈవీఎంల కారణంగానే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందే తప్ప, ప్రజల గుండెల్లో పార్టీ స్థానం స్థిరంగా ఉందని అన్నారు. అయితే టీడీపీ ఓడిపోయిందనడంలో నిజం లేదని వ్యాఖ్యానించారు.
ఇక తమ కుటుంబం ప్రజల కోసమే పని చేస్తోందని, గడచిన ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేశామని అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలకు నీటి కొరత లేకుండా చూసేందుకు రూ. 200 కోట్లను ఖర్చు చేశామన్నారు.
అలాగే ఏ గ్రామాన్నీ పక్షపాతంతో చూడలేదని, పార్టీలకు అతీతంగా పనిచేశామని చెప్పారు. అయితే వైసీపీ గెలవగానే గొడవలకు దిగుతున్నారని, ఇది సరికాదని పరిటాల శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. ఇక తమ కుటుంబానికి అభిమానులు, ప్రజలు అండగా ఉన్నంతవరకూ ఎమ్మెల్యేలు, మంత్రులం తామేనని, నియోజకవర్గ ప్రజలందరమూ ఓ కుటుంబంగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.








