
అమరావతి: ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల హడావిడిలో మునిగిపోయి కనిపిస్తోంది. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి దశలోనే లోక్‌సభ ఎన్నికలు.. అదే రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతుండడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే నామినేషన్ల దాఖలు వ్యవహారం పూర్తి చేసుకొని అన్ని పార్టీల నేతలు ఎవరి ప్రచారంలో వారు నిమగ్నమయ్యారు. మరోవైపు పోలింగ్‌కు 48 గంటల ముందుగా.. అంటే రేపటితోనే ఎన్నికల ప్రచార పర్వానికి కూడా తెరపడనుంది.
ఏప్రిల్ 11న అసెంబ్లీకి, లోక్‌సభకి పోలింగ్ జరగనుంది ఇక ఎన్నికల పర్వం మొదలైందంటే చాలు.. సర్వేల హడావిడి అంతా ఇంతా కాదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి ఫలితాలు వచ్చే వరకు కూడా పలు ప్రముఖ సంస్థలు ప్రీపోల్ సర్వేలు జరిపి వాటి ఫలితాలను వెల్లడిస్తూనే ఉంటాయి.
ఇక ఎన్నికల సర్వే అంటే చాలు.. అందరికీ గుర్తుకొచ్చే పేరు లగడపాటి రాజగోపాల్. లగడపాటి అంటే సర్వే అన్నట్టుగా పేరు తెచ్చుకున్నారాయన ఈయన్ని ఆంధ్రా ఆక్టోపస్‌గా కూడా అభివర్ణిస్తారు. రాష్ట్రాన్ని రెండుగా విడగొడితే తాను రాజకీయ సన్యాసం చేస్తాను అని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని హెచ్చరించిన లగడపాటి, విభజన అనంతరం మాట మీద నిలబడి.. కాంగ్రెస్ పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
ప్రస్తుతం లగడపాటి రాజగోపాల్ క్రియాశీల రాజకీయాల్లో లేనప్పటికీ.. ఆయన పేరు మాత్రం కొన్ని కొన్ని సందర్భాలలో ఢిల్లీ నుండి గల్లీ దాక మారుమోగుతూనే ఉంటుంది. లగడపాటి సర్వే చేశారంటే.. ఆ ఫలితాలకు తిరుగులేదు అని అందరూ నమ్ముతారు.
ఇక అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం ఏపీలో ప్రధాన పోరు వైసీపీ, టీడీపీ మధ్యే కనిపిస్తుంది. గత ఎన్నికలలో కొద్దిలో అధికారం కోల్పోయిన వైఎస్ జగన్, ఈ ఎన్నికలలో తప్పక గెలిచి, అధికారాన్ని చేపట్టాలని అనుకుంటున్నారు. అలాగే మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ అధికారం టీడీపీదే అంటూ నొక్కి వక్కాణిస్తున్నారు.
సరిగ్గా మూడు రోజుల ముందు…
ఈ నేపథ్యంలో పోలింగ్‌కి సరిగ్గా మూడు రోజుల ముందు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి ఏపీలో జరగబోయే ఎన్నికలపై తనదైన శైలిలో సర్వే ఫలితాలను ప్రకటించారు. లగడపాటి సర్వే ప్రకారం..
ప్రస్తుత ఎన్నికలలో ఏపీలో అధికారం వైసీపీదే. వైసీపీకి గట్టి పోటీనిచ్చే పరిస్థితుల్లో కూడా టీడీపీ లేదని తెలుస్తోంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజవర్గాల్లో వైసీపీ 110 కిపైగా సీట్లు సాధిస్తుందని , టీడీపీ 40 నుండి 45 సీట్లు మాత్రమే సాధిస్తుంది అని వెల్లడైంది.
జనసేనతో పాటుగా మిగిలిన పార్టీలు, స్వతంత్రులు కలిపి 20 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. ఇకపోతే మరో ముఖ్య విషయం గత ఎన్నికలలో వైసీపీ అధికారం కోల్పోయినా.. టీడీపీ కంటే కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే తక్కువ వచ్చాయి.
ఇక లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే.. ఎంపీ సీట్ల విషయంలో కూడా 52% ఓట్లతో, 20 సీట్లు వైసీపీయే కైవసం చేసుకుంటుందని , టీడీపీకి 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని లగడపాటి సర్వేలో వెల్లడైంది.
పాదయాత్ర, నవరత్నాలకు ప్రజలు ఫిదా…
ముఖ్యంగా ఈసారి ఏపీ ప్రజలు వైఎస్ జగన్‌కి పట్టం కట్టాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణం.. అయన చేసిన పాదయాత్ర, అధికారంలోకి వస్తే అమలు చేస్తానని హామీ ఇచ్చిన ‘నవరత్నాలు’ అని తెలుస్తోంది. ఏడాదిన్నరపాటు నిరంతరంగా.. దాదాపుగా 3500 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి, ఏపీ ప్రజల మనసులను జగన్ గెలుచుకున్నాడని ఈ సర్వే ద్వారా వెల్లడైంది.
ఇప్పటికే పలు ప్రాంతీయ, జాతీయ సర్వేలలో సైతం ఏపీకి కాబోయే సీఎం జగనే అని వెల్లడైంది. ఈ నేపథ్యంలో మే 23న భారీ మెజారిటీతో విజయం సాధించి, వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు లగడపాటి తాజా సర్వేతో మరోమారు వెల్లడైంది.








