25.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో బిగ్ షాక్

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో బిగ్ షాక్

- Advertisement -

రాజమహేంద్రవరం: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్సార్ సీపీ (YSRCP) ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ (అనంతబాబు)కు న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు మంగళవారం డిస్మిస్ చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.

ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (Special PP) ముప్పాళ్ల సుబ్బారావు కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. “నిందితుడైన అనంతబాబు(Anantha Babu)కు గతంలోనే నేరచరిత్ర ఉంది. సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినప్పటికీ, బయటకు వచ్చిన తర్వాత ఆయన సాక్షులను బెదిరించడం, లోబరుచుకునేందుకు ప్రయత్నించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారు. కేసు కీలక దశలో ఉన్నందున, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున నిందితుడికి ఎలాంటి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయకూడదు” అని స్పెషల్ పీపీ ధర్మాసనానికి విన్నవించారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు సమర్పించిన ఆధారాలు, వాదనలతో ఏకీభవించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు(Anantha Babu)కు ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సాక్షులను బెదిరించారనే ఆరోపణలతో ఏప్రిల్‌లోనే ఆయన బెయిల్‌ను రద్దు చేసి మళ్లీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

2022 మే నెలలో తన మాజీ డ్రైవర్ విధి సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని స్వయంగా తన కార్లోనే బాధితుడి ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశారనే తీవ్ర ఆరోపణలను అనంతబాబు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతుండటంతో ఆయన జైలులోనే కొనసాగనున్నారు.

- Advertisement -