
చెన్నై: తమిళనాడు రాజకీయాలు తీవ్రమైన మలుపు తిరిగాయి.
నటి త్రిషను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర నిరసనల మధ్య ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కేవలం ఒక తాత్కాలిక వివాదం మాత్రమే కాదు.. ఇది డీఎంకే (DMK) వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయనిధి స్టాలిన్ రాజకీయ జీవితంలో ఒక పెద్ద ప్రతిష్ఠంభనకు లేదా ‘స్టాలిన్‌గ్రాడ్’ వంటి చారిత్రాత్మక దెబ్బకు దారితీస్తుందా అనే విశ్లేషణలు మొదలయ్యాయి.
వివాదాల ‘హాట్రిక్’గత కొన్నేళ్లుగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వరుస వ్యాఖ్యలు, నిర్ణయాలు ఆయనను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.
సనాతన ధర్మం వ్యాఖ్యల వివాదం: “సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాగా నిర్మూలించాలి” అని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఉత్తరాది రాష్ట్రాలలోనూ డీఎంకే, ఇండియా కూటమికి ఇది రాజకీయంగా పెద్ద మచ్చగా మారింది.
శశికళ వివాదం: గతంలో శశికళ, జయలలిత వంటి సీనియర్ మహిళా నేతలపై ఆయన చేసిన పరోక్ష విమర్శలు, సంచలన వ్యాఖ్యలు తమిళనాడులోని నిర్దిష్ట వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రాజేశాయి.
త్రిష వ్యాఖ్యల కలకలం: తాజాగా కావేరి జలాల నిరసన సభలో నటి త్రిష పేరుతో ‘ద్వంద్వార్థ’ (డబుల్ మీనింగ్) డైలాగులు చెప్పడం సంచలనంగా మారింది. అధికార టీవీకే (TVK) పార్టీ, బీజేపీలు దీనిని మహిళా హక్కులు, గౌరవానికి ముడిపెట్టి ఆందోళనలు తీవ్రతరం చేశాయి.
‘స్టాలిన్‌గ్రాడ్’ తరహా రాజకీయ మలుపా?
రెండో ప్రపంచ యుద్ధంలో ‘స్టాలిన్‌గ్రాడ్’ పోరాటం హిట్లర్ సైన్యానికి ఎలాగైతే ఓటమికీ, పతనానికీ నాందిగా మారిందో.. ఇప్పుడు ఉదయనిధికి కూడా వరుస వివాదాలు, అరెస్టుల పర్వం ఒక పెద్ద రాజకీయ మలుపుగా మారుతుందా? అనే చర్చ మొదలైంది.
ఒకవైపు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే వేగంగా దూసుకురావడం, మరోవైపు నిరుద్యోగం, మహిళల భద్రత, కావేరి జలాల సమస్యలపై డీఎంకేను ఎండగడుతుండటంతో ఉదయనిధి స్వయంగా కొనితెచ్చుకుంటున్న ఈ వివాదాలు రాబోయే ఎన్నికల్లో డీఎంకే భవిష్యత్తును దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలతో బెయిల్ లభించినప్పటికీ, ‘సనాతన-శశికళ-త్రిష’ వివాదాల నీడలు ఉదయనిధి రాజకీయ భవిష్యత్తుపై సుదీర్ఘకాలం ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.








