ప్రేమజంటకు పెళ్లి చేసిన ట్రాఫిక్ చలానా! సోషల్ మీడియాలో వైరల్…

- Advertisement -

గుజరాత్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ట్రాఫిక్ పోలీసులు పంపిన చలానా ఓ ప్రేమ జంటను దగ్గర చేసింది. రహస్యంగా సాగుతున్న వారి ప్రేమ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చి పెళ్లికి దారిచూపింది. ఇప్పుడీ ప్రేమకథ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

చదవండి: గూగుల్‌లో ‘Thanos’ అని టైప్ చేసి.. ఏం జరుగుతుందో చూడండి!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన వాత్సల్ పరేఖ్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలిసి రోజూ నగరమంతా బైక్‌పై షికార్లు చేసేవారు. బైక్‌పై చక్కర్లు కొట్టే సమయంలో ఇటీవల ఓ సిగ్నల్‌ను పరేఖ్ జంప్ చేశాడు. అక్కడి సీసీ టీవీ కెమెరా ఇది పసిగట్టి ఫొటోను క్యాప్చర్ చేసింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పరేఖ్‌ ఇంటికి పోలీసులు చలానా పంపారు.

కుమారుడి నిజాయతీకి మెచ్చి…

చలానా చూసిన పరేఖ్ తల్లిదండ్రులు షాకయ్యారు. బైక్‌పై తమ కుమారుడి వెనక ఓ యువతి కూర్చుని ఉండడాన్ని చూసి నిర్ఘాంతపోయారు. కుమారుడు ఇంటికి రాగానే నిలదీశారు. పరేఖ్ ఏమాత్రం తడబడకుండా ఆ అమ్మాయిని తాను ప్రేమిస్తున్నానని చెప్పాడు.

కుమారుడి నిజాయతీకి మెచ్చిన తల్లిదండ్రులు నేరుగా వెళ్లి యువతి తల్లిదండ్రులతో మాట్లాడారు. వీరి ప్రేమకు వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెళ్లికి ఓకే చెప్పారు.  రెండు రోజుల క్రితం నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక పెళ్లే తరువాయి.

చదవండి: 33 వేల అడుగుల ఎత్తులో విమానం.. సడన్‌గా డోర్ తెరచిన ప్రయాణికుడు! ఆ తరువాత…

తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలా? అని ఆలోచిస్తున్న సమయంలో ట్రాఫిక్ చలానా రూపంలో పోలీసులు తనకు చెప్పలేనంత సాయం చేశారంటూ పరేఖ్ వారికి థ్యాంక్స్ చెప్పాడు. తమ ప్రేమకు ఇంత సులభంగా శుభం కార్డు పడుతుందని ఊహించలేదంటూ మొత్తం విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. క్షణాల్లోనే వీరి లవ్ స్టోరీ వైరల్ అయింది.

- Advertisement -