విచిత్రం: కాసేపట్లో అంత్యక్రియలు.. అంతలోనే చనిపోయిన యువకుడు లేచి కూర్చున్నాడు!

patient-on-ventilator
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో సోమవారం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడ్ని అక్కడి డాక్టర్లు చనిపోయినట్లుగా ప్రకటించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఘొల్లుమన్నారు. మొత్తంమీద అతడి మృతదేహం ఇంటికి చేరుకుంది.

చదవండి: ఛీ..ఛీ..: మెట్రో స్టేషన్‌లో మహిళపై ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

బాధాతప్త హృదయాలతోనే అతడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ యువకుడి దేహంలో కదలిక కనిపించింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు పరుగు పరుగున అతడ్ని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించగా.. అక్కడి డాక్టర్లు ఆ యువకుడిని వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే… ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో గత నెల 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మహ్మద్ ఫర్జాన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే సోమవారం ఆసుపత్రి డాక్టర్లు అతడు చనిపోయినట్లు ప్రకటించారు. అప్పటికే అతడి కుటుంబ సభ్యులు చికిత్స కోసం దాదాపు రూ.7 లక్షలు ఖర్చుచేశారు.

చనిపోయాడని చెప్పడంతో…

అయినా లాభం లేకపోవడంతో పుట్టెడు దు:ఖంతోనే కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి ఫర్జాన్‌ మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్లారు. చిన్న వయసులోనే అతడికి నూకలు చెల్లిపోయాయని బాధపడుతూ స్మశానానికి బయలుదేరి అతడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయసాగారు.

చదవండి: విషాదం: మ్యాజిక్ అన్నాడు.. నదిలోకి దిగాడు.. బయటికి మాత్రం రాలేదు…

అయితే అంతలోనే ఫర్జాన్ దేహంలో కదలిక కనిపించింది. ఇది గమనించిన అతడి కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడ్ని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ఫర్జాన్‌కు వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ‘‘ఫర్జాన్‌ది కచ్చితంగా బ్రెయిన్ డెడ్ కాదు.. అతడి పల్స్, బీపీ కొంత క్షీణించినా శరీరం మాత్రం చికిత్సకు స్పందిస్తోంది.. అయినా పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది..’’ అని అతడికి చికిత్స అందిస్తోన్న వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా, అంతకుముందు ఫర్జాన్ మరణించాడని, అతడి మృతదేహాన్ని తీసుకెళ్లొచ్చంటూ అతడికి చికిత్స అందించిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. సదరు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకంపై ఫర్జాన్ అన్న మహ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ.. తాము అప్పటికే తమ సోదరుడి చికిత్స కోసం ఆసుపత్రికి దాదాపు రూ.7 లక్షలు చెల్లించామని తెలిపారు.

ఇక తమ వద్ద డబ్బు లేదని గ్రహించే ఆసుపత్రి వైద్యులు వదిలించుకోవాలని భావించి, తమ సోదరుడు చనిపోయాడని ప్రకటించారని, దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) నరేంద్ర అగర్వాల్ కూడా స్పందించారు. దీనిపై లోతైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చదవండి: ఆశ్చర్యం: ఒక్క పెయింటింగ్ ఖరీదు రూ.778 కోట్లు..! ఇంతకీ ఏముంది అందులో..?
- Advertisement -