Telangana Schools Re-Open: తెలంగాణలో నేటి నుంచే స్కూల్స్ రీ-ఓపెన్: సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -

హైదరాబాద్: వేసవి సెలవుల పొడిగింపు ఉండదని, తెలంగాణలో సోమవారం (13 జూన్ 2022) నుంచి అన్ని రకాల పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు.

ఆదివారం దీనిపై మీడియాతో ఆమె మాట్లాడారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మంత్రి వ్యాఖ్యానించారు.

వేసవి సెలవుల అనంతరం, తిరిగి పాఠశాలలు తెరుచుకుంటున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పిల్లలకు స్వాగతం పలుకుతున్నట్లు మంత్రి చెప్పారు.

‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా 9 వేల పాఠశాలల్లో వివిధ పనులు జరుగుతున్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ పనులు కొనసాగుతాయని తెలిపారు.

ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్…

ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుందని మంత్రి సబిత వెల్లడించారు. దీనికోసం అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుందన్నారు.

అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గతంలో మాదిరిగానే పుస్తకాలు, యూనిఫాం అందిస్తామని చెప్పారు.

ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ అంశంపై మాట్లాడుతూ.. కేబినెట్ సబ్ కమిటీ రివ్యూ చేస్తోందని, ఫీజుల నియంత్రణకు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని సబిత వివరించారు.

‘‘ఎక్కడ్నించి డ్రా చేసుకోవాలో చెప్పండి..’’

‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం నిధులకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని సబిత అన్నారు.

ఒకవేళ నిజంగా కేంద్రం రూ.2700 కోట్లు ఇస్తే.. వాటిని ఎక్కడ్నించి డ్రా చేసుకోవాలో బండి సంజయ్ చెప్పాలంటూ ఆమె సవాల్ విసిరారు. ఇప్పటికైనా విషయం పూర్తిగా తెలుసుకుని బాధ్యతగా మాట్లాడాలన్నారు.

అసలు బీజేపీ నాయకులకు మాట్లాడే అర్హతే లేదని, నిజంగా నవోదయ, గిరిజన యూనివర్సిటీ వంటివి రాష్ట్రానికి తీసుకొచ్చిన తరువాతే బీజేపీ నేతలు మాట్లాడాలని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

- Advertisement -