వైసీపీ ఎఫెక్ట్ మంత్రులకి షాక్ ఇస్తున్న అధికారులు!

1:29 pm, Tue, 16 April 19
chandrababu naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వెలువడటానికి మరో నెల రోజులకు పైగా సమయం ఉంది. అప్పటివరకు ఏపీలో టీడీపీ ప్రభుత్వమే కొనసాగనుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి.

కీలకమైన నిర్ణయాల సంగతి ఎలా ఉన్నా, ఏపీ మంత్రులు మాటను కొందరు అధికారులు పట్టించుకోవడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీలో ఈ సారి అధికార మార్పిడి జరగడం ఖాయమని టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వస్తుందనే ప్రచారం కారణంగానే కొందరు అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేల మాటను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

పలువురు అధికారులైతే… మరికొద్ది రోజుల్లో మీరు అధికారం కోల్పోవడం ఖాయమంటూ నేతలకు నేరుగా చెబుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారుల వ్యవహారశైలిని కొందరు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

అయితే త్వరలోనే తాము అధికారంలోకి రావడం ఖాయమని… ప్రభుత్వానికి అధికారులు సహకరించి ఇబ్బందులు తెచ్చుకోవద్దని వైసీపీ ముఖ్యనేతలు సూచించడం కూడా అధికారులు తీరు మారడానికి కారణం కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే కేవలం కొందరు అధికారులు వ్యవహరించిన తీరు వల్ల రాష్ట్రంలోని అధికారులంతా మంత్రులు, ఎమ్మెల్యేల మాటలు వినడం లేదనే వాదన సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఏపీలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భాగంగానే ఈ పరిణామం కూడా జరుగుతుందేమో అని ప్రచారం జరుగుతోంది.