కశ్మీర్‌లో ఇప్పుడు ఎవరైనా ఇల్లు కొనుక్కోవచ్చా?

can anyone buy a property now in jammu kashmir?
- Advertisement -

శ్రీనగర్: కశ్మీర్.. ఈ పేరు వినగానే అక్కడి ప్రకృతి దృశ్యాలు కళ్లెదుట కదలాడుతాయి. కశ్మీర్‌ను సందర్శనకు వెళ్లిన వారికయితే.. ‘అబ్బ ఓ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది..’ అనిపించకమానదు. అయితే ఇన్నాళ్లూ ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా కశ్మీరేతరులు అక్కడ ఉండడానికే కుదిరేది కాదు.

కానీ ఇటీవల కేంద్రం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తోన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లను రద్దు చేసింది. దీంతో దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే.. కశ్మీర్ వెళ్లి అక్కడ కూడా నివసించే అవకాశం కలిగింది.

దీంతో కశ్మీర్‌లో ఇల్లు కొనుక్కోవాలని, స్థలాలు కొనుక్కోవాలని ఆశిస్తున్న వారెందరో. మరోవైపు కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేయగానే కశ్మీర్‌లో ఇప్పుడు ఎవరైనా స్థలం కొనుక్కుని అక్కడ ఇల్లు కట్టుకోవచ్చంటూ రియల్ ఎస్టేట్ రంగ ప్రకటనలు సోషల్ మీడియాలో హోరెత్తాయి.

ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో కశ్మీరేతరులకు ఇప్పుడు కశ్మీర్‌లో శాశ్వత నివాసం ఏర్పరుచుకోవడానికి ఉన్న ప్రధాన ప్రతిబంధకం కూడా తొలగిపోయింది. దీంతో అందరి చూపు కశ్మీర్‌పై పడింది. అక్కడ ఆస్తులు (ఇళ్లు, భూములు) కొనాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే కశ్మీర్‌లో పరిస్థితులు సద్దుమణిగే వరకు వేచి చూద్దామని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అసలు కశ్మీర్‌లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగ పరిస్థితి ఏమిటి? భూముల ధరలు ఎలా ఉన్నాయి. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కోవచ్చా? లేక స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని నివసించవచ్చా? వివరంగా చూద్దాం…

కశ్మీర్‌లో కూడా మిగిలిన రాష్ట్రాల మాదిరే…

గతంలో ఉన్న జమ్మూకశ్మీర్‌ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌, లడాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ భారత్‌లోని మిగతా రాష్ట్రాలతో సమానమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని చట్టాలు, నియంత్రణల విషయంలో.. కశ్మీర్‌కు కూడా మిగతా రాష్ట్రాలతో సమానంగా వర్తిస్తాయి.

ఫలితంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రజలు ఎలాగైతే స్వేచ్ఛగా జీవిస్తున్నారో.. ఇకమీదట కశ్మీర్‌లో కూడా ఎవరైనా సరే అలా జీవించవచ్చు. కశ్మీర్‌కు ఇంతకాలంగా ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో ఇది సుగమం అయింది.

ఆర్టికల్ 370 రద్దుతో.. ఏం జరుగుతుంది?

రియాల్టీ రంగ నిపుణులు కొందరు ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి అమాంతం పెరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడి స్థానికులు వాళ్ల కళ్లముందరే ఉహించని మార్పును​ చూస్తారన్నారు.

బాలీవుడ్‌ తదితర సినిమా ఇండస్ట్రీలు అక్కడికి వయస్తాయని, అలాగే భారీ కంపెనీలు కూడా అక్కడి మార్కెట్‌ వృద్ధికి వ్యూహాత్మకంగా పనిచేస్తూ స్థానిక సంస్థలతో కలిసి జాయింట్‌ వెంచర్స్‌ ఏర్పాటు చేస్తాయని పేర్కొన్నారు. అయితే ఇదంతా వెంట వెంటనే జరిగిపోయేది కాదు. దీనికి ఎంతో కాలం పడుతుంది.

ప్రస్తుతం రియాల్టీ రంగ పరిస్థితి ఇలా…

జమ్మూకశ్మీర్‌లో ప్రధానంగా టైర్2, టైర్3 పట్టణాలు రియల్టీ గమ్యస్థానాలుగా మారుతాయి. లడాఖ్‌ నుంచే రియల్‌ ఎస్టేట్‌ ప్రారంభం కావచ్చు. శ్రీనగర్‌లో ప్రస్తుతం చదరపు అడుగు రూ.2500 నుంచి రూ.3200 ఉంది. జమ్మూలో రూ.2400 నుంచి రూ.4000 ఉండగా బారాముల్లాలో రూ.2500 నుంచి రూ.3200 ఉంది.

అయితే వీటి కొనుగోలుపై స్థానికేతరులకు ఇప్పుడే అనుమతి లేదు. ఎందుకంటే.. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే కశ్మీర్‌లో కూడా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) విధానం రూపుదిద్దుకోవలసి ఉంది. దానిపైనే అక్కడ భూములు, ఇళ్ల కొనుగోళ్లు ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం ఈ రెరా విధానాల రూపకల్పనపై కృషి జరుగుతోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సింది ఉంది. ఈ ప్రక్రియలో కొంత జాప్యం కూడా చోటుచేసుకోవచ్చు.

సోషల్ మీడియాలో ఆ ప్రకటనల సంగతేంటి?

ఇక కశ్మీర్‌లో విల్లాలు, బంగ్లాలను కొనండంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనల పట్ల పలువురు నెటిజన్లు ఆకర్షితులవుతున్న మాట వాస్తవమే. కానీ ఈ విషయంలో నిపుణుల సలహా ప్రకారమే నడుచుకోవడం శ్రేయస్కరం. ఎందుకంటే.. జమ్మూకశ్మీర్‌కు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భారీ సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంకా ఆ దిశగా సరైన కృషి జరగలేదు.

ఇప్పుడు అవకాశం వచ్చినా తక్షణ అభివృద్ధికి ఎంతో సమయం పడుతుంది. ఎందుకంటే నిబంధనల చుట్టూ చాలా అస్పష్టత ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి ఆకర్షితులై తొందరపడి స్థలాలు, ఇళ్లు కొనుక్కోకుండా.. మరికొంత కాలం ఆగడమే శ్రేయస్కరం.

- Advertisement -