చెన్నై: ప్రో కబడ్డీ లీగ్ సీజన్-6 లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ జట్టు 32-25 స్కోరుతో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. స్టార్ రైడర్ మోను గోయత్ 7 పాయింట్లతో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి కుల్దీప్ సింగ్ కూడా 7 పాయింట్లతో చక్కని సహకారాన్నిచ్చాడు.
గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ జట్టులో సచిన్, ప్రపంజన్ కలిసి 17 పాయింట్లు, సునీల్ కుమార్ 5 టాకిల్ పాయింట్లు తీసుకొచ్చారు. మోను, కుల్దీప్ రైడింగ్‌లో రాణించడంతో మ్యాచ్ తొలి అర్థభాగంలో హర్యానా స్టీలర్స్ 20-13 స్కోరుతో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్థభాగంలోనూ స్టీలర్స్ ఆ ఆధిపత్యాన్ని కొనసాగించింది.
ఐతే గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ కూడా చాలావరకు పోరాడింది. ప్రపంజన్ వరుస రైడ్ పాయింట్లతో ఆ జట్టును పోటీలో నిలిపాడు. అయితే అతడి ప్రయత్నం ఫలించలేదు. హర్యానా స్టీలర్స్ చివరి వరకు ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకుని విజయం సాధించింది.
దంబాంగ్ ఢిల్లీకి తొలి విజయం…
ఈ సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ జట్టు కూడా తొలి విజయం సాధించింది. పుణెరి పల్టన్‌తో హోరాహోరీగా సాగిన పోరులో 41-37 స్కోరుతో దబాంగ్ ఢిల్లీ గెలుపొందింది. ఢిల్లీ జట్టులో నవీన్ కుమార్ 1 పాయింట్ చెయ్యగా, చంద్రన్ రంజిత్ 6 పాయింట్లు, విశాల్ మానె 5 పాయింట్లుతో తమ సత్తా చాటారు. పుణెరి పల్టన్ జట్టులో నితిన్ తోమర్ 20 పాయింట్లు చేసినా ప్రయోజనం లేకపోయింది.