డేటా స్కాం తీవ్రమైంది: ‘చంద్రబాబు దొంగ’ అంటూ జగన్ నిప్పులు

- Advertisement -

నెల్లూరు: గోప్యంగా ఉంచాల్సిన ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన ఓ నేరగాడు, దొంగ, నారాసురుడు అనే రాక్షసుడు ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నెల్లూరులోని ఎస్‌వీజీఎస్‌ కళాశాల మైదానంలో జరిగిన వైసీపీ సమర శంఖారావ సభలో ఆయన మాట్లాడారు.

ప్రజల బ్యాంకు ఖాతాలు, చెక్కుల వివరాలు సీఎం చంద్రబాబుకు తెలుసని, ప్రజల ఆధార్‌ సమాచారం సైతం ఆయన వద్ద ఉందని ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన సున్నితమైన విషయాలు ప్రైవేటు సంస్థలకు ఎలా చేరాయని ప్రశ్నించారు. ప్రజల డేటాను ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఈ విషయంలో చంద్రబాబు చేసిన నేరం చాలా తీవ్రమైందన్నారు.

ఐటీ, బ్లూఫ్రాగ్‌ సంస్థలు ప్రైవేటు కంపెనీలని, టీడీపీకి సంబంధించిన సేవా మిత్ర యాప్‌ను ఆ కంపెనీలే తయారు చేశాయని చెప్పారు. ఈ కంపెనీలు ఎవరివి? ఎవరు పెట్టించారు? అని జగన్‌ ప్రశ్నించారు. ఫారం -7 ఇచ్చి దొంగ ఓట్లు తీసేయాలని తామే కోరామని, అందులో తప్పేముందని జగన్‌ ప్రశ్నించారు. 

దొంగపనులు చేస్తూ మాపైనే విమర్శలా…?

‘ప్రజల సున్నితమైన డేటా చోరీ గురించి కేం‍ద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే మనల్ని, మన కార్యకర్తల్ని దూషిస్తారు. ఎల్లో మీడియా అండతో రెచ్చిపోతున్న చంద్రబాబు.. సరైన ఓట్లు చేర్పించమని అర్జీ పెడితే మనం వ్యవస్థలను నాశనం చేస్తున్నామంటూ దుష్ప్రచారం చేస్తారు. మా సొంత చిన్నాన్న వైఎస్‌ వివేకానంద రెడ్డి ఓటును తొలగించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇటువంటి పరిస్థితులు నారా లోకేష్‌కు మాత్రం ఎదురుకావు’ అని జగన్ ధ్వజమెత్తారు.

‘చంద్రబాబు నిర్వాకం వల్ల మీ బ్యాంకు అకౌంట్ నంబర్లు, ఆధార్‌ నంబర్లు ప్రైవేటు ఐటీ కంపెనీలైన బ్లూ ఫ్రాగ్‌, ఐటీ గ్రిడ్‌ చేతుల్లో ఉన్నాయి. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ను తయారు చేసింది కూడా ఈ కంపెనీలే. వీరి వద్దకు ప్రజల వ్యక్తిగత డేటా ఎలా వెళ్లింది. ఇవి రెండూ చంద్రబాబు బినామీ కంపెనీలు. ఇలాంటి నేరం సాధారణ వ్యక్తి చేసి ఉంటే అతడిని దొంగ అంటాం. కానీ మన ఖర్మ ఏంటంటే డేటా దొంగిలించిన వ్యక్తిని మనం సీఎం అంటున్నాం. ఆయన కొడుకును ఐటీ మంత్రి అంటున్నాం’ అని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

‘ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినపుడు సెక్షన్‌ 8 అంశాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా అదే తరహాలో తప్పించుకోవాలని చూస్తున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఆంధ్రా కంపెనీలపై.. తెలంగాణ పోలీసుల దాడులు ఏంటని పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు’ అని వైసీపీ అధినేత మండిపడ్డారు.

తాము అధికారంలోకి రాగానే కుల, మత, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా అందరినీ ఆదుకుంటామన్నారు. అధికార పార్టీ అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తామని స్పష్టం చేశారు.

చదవండి: టీడీపీకి మరో షాక్ తప్పేలా లేదు! పవన్ కళ్యాణ్‌తో ఎమ్మెల్సీ మాగంటి భేటీ

- Advertisement -