ప్రపంచకప్: విండీస్ ని మట్టికరిపించిన ఆసీస్!

7:06 am, Fri, 7 June 19
విండీస్ ని మట్టికరిపించిన ఆసీస్
విండీస్ ని మట్టికరిపించిన ఆసీస్

నాటింగ్‌హామ్‌ : తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ముచ్చెమటలు పట్టించి చిత్తుచిత్తుగా ఓడించిన వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. గెలిచే మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ చివరి ఓవర్లలో చేసిన పొరపాట్లు విండీస్‌ ఓటమికి కారణమయ్యాయి.

తొలుత ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేక పోయింది. అనంతరం బ్యాటింగ్‌లోనూ గెలుపు వైపు పయనిస్తున్న సమయంలో అనవసరపు షాట్లకు యత్నించి బ్యాట్స్‌మెన్‌ ఔటవ్వడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు.

ప్రపంచకప్‌లో భాగంగా ఆసీసీతో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఆసీస్‌ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను స్టార్క్‌(5/46) గడగడలాడించాడు. స్టార్క్‌తో పాటు కమిన్స్‌(2/41)రాణించడంతో విండీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 279 పరుగులకే పరిమితమైంది.

విండీస్‌ ఆటగాళ్లలో హోప్‌(68), హోల్డర్‌(51), నిఖోలస్‌(40) మినహా ఎవరూ గొప్పగా రాణించలేదు. ఈ మ్యాచ్‌లో రాణిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులను క్రిస్‌ గేల్‌(18), రసెల్‌(15)లు పూర్తిగా నిరాశపెట్టారు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌కు విండీస్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. కరేబియన్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ సారథి ఫించ్‌(6)తో సహా వార్నర్‌(3), ఖవాజా(13), మ్యాక్స్‌వెల్‌(0), స్టొయినిస్‌(19)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే కౌల్టర్‌ నైల్‌(92), స్టీవ్‌ స్మిత్‌(74)లు రాణించడంతో కనీస స్కోర్‌నైనా సాధించగలిగింది.