వరల్డ్ కప్: వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ వాయిదా…

1:50 am, Wed, 10 July 19
india-vs-newzeland-match-postponed-due-to-rain

మాంచెస్టర్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం జరుగుతున్న వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డం తగిలాడు. మరికాసేపట్లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగుస్తుందనగా, వర్షం మొదలవడంతో మ్యాచ్ నిలిపివేశారు. మైదానాన్ని చాలావరకు కవర్లతో కప్పివేశారు.

వర్షం వల్ల మ్యాచ్  ఆగిపోయే సమయానికి కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాస్ టేలర్ (67), టామ్ లాథమ్ (3) ఉన్నారు. మరోవైపు వర్షం ఉద్ధృతం అవడంతో మ్యాచ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒకవేళ మ్యాచ్ సాధ్యమైన పక్షంలో ఓవర్లు కుదించాల్సి వస్తే, టీమిండియా లక్ష్యం 20 ఓవర్లలో 148 పరుగులు కానీ, 46 ఓవర్లలో 237 పరుగులు కానీ అవుతుందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. 

అనుకున్నదే అయింది…

వరుణుడి ప్రతాపానికి భారత్, న్యూజిలాండ్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం పలుమార్లు దోబూచులాడడంతో మైదానాన్ని సిద్ధం చేసే పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. దీంతో మ్యాచ్‌‌ను బుధవారానికి వాయిదా వేశారు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ కప్‌లో సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేను ఏర్పాటు చేశారు.

బుధవారం షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ మొదలవుతుంది. న్యూజిలాండ్ జట్టు 46.1 ఓవర్ల నుంచి బ్యాటింగ్ కొనసాగించాల్సి ఉంటుంది.  మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాస్ టేలర్ (67), టామ్ లాథమ్ (3) ఉన్నారు. 

కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతమైన క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ చేసి న్యూజిలాండ్ జట్టుని భారీ స్కోరు చేయనివ్వకుండా కట్టడిచేశారు. ముఖ్యంగా కొత్త బంతితో బుమ్రా, భువనేశ్వర్ నిప్పులు చెరిగారు. మిడిల్ ఓవర్లలో చాహల్, పాండ్య, జడేజా తమవంతు సహకారం అందించారు.

భారత్ ఈ మ్యాచ్ కోసం ఐదుగురు బౌలర్లతో బరిలో దిగగా, అందరూ తలో వికెట్‌తో కివీస్‌ను నిలువరించారు. ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఓ మార్పు చోటుచేసుకుంది. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో యజువేందర్ చాహల్ జట్టులోకి వచ్చాడు.