అంతర్జాతీయ క్రికెట్‌కు అంబటి రాయుడు గుడ్ బై! తీవ్ర అసంతృప్తిలో రాయుడు.. కారణమెవరు?

6:07 pm, Wed, 3 July 19
team-india-cricketer-ambati-rayudu

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్‌ సహా అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు బీసీసీఐకి మెయిల్ ద్వారా తన రిటైర్మెంట్‌ను తెలియజేశాడు.

ప్రస్తుతం జరుగుతోన్న ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంతో రాయుడు మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.  ప్రపంచ కప్ భారత సెలెక్టర్లు తనను ఎంపిక చేయకపోవడంపై అంబటి రాయుడు అప్పట్లోనే తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: ప్రపంచ కప్ 2019: బంగ్లాదేశ్‌పై గెలుపు.. ఎట్టకేలకు సెమీస్‌లోకి టీమిండియా!

తాను 3డీ కళ్లజోడు పెట్టుకుని చూస్తానంటూ ట్వీట్ చేశాడు. తనను కాకుండా విజయ్ శంకర్ ను ఎంపిక చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయ శంకర్ త్రీ డైమన్షన్ ప్లేయర్ అని, అందుకు జట్టులోకి తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పడంతో అంబటి రాయుడు తన అసంతృప్తిని అలా వ్యక్తపరిచాడు.

మరోవైపు రిషబ్ పంత్ కూడా ప్రపంచ కప్ 2019 తుది జట్టులోకి తనను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. రాయుడు, పంత్ ఇద్దరినీ ప్రపంచ కప్ జట్టుకు రిజర్వ్‌డ్ ప్లేయర్లుగా ప్రకటించారు. అయితే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో ప్రపంచ కప్‌కు దూరమైన నేపథ్యంలో రిజర్వ్‌డ్ ఆటగాడిగా ఉన్న రిషబ్ పంత్‌కు జట్టులో అవకాశం దక్కింది.

ఆ తర్వాత మరో ఆటగాడు విజయ శంకర్ కూడా గాయం కారణంగా టీమిండియాకు దూరం కాగా, ఆ సమయంలో తనకు అవకాశం వస్తుందని అంబటి రాయుడు భావించాడు. అయితే, బిసీసీఐ రాయుడిని కాకుండా మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకుంది.

చదవండి: ఓ ఆటాడుకున్నారు..! పాక్‌పై కొనసాగిన.. టీమిండియా జైత్రయాత్ర!!

దీంతో అంబటి రాయుడు తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ఈ కారణంగానే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు అతడు ప్రకటించి ఉంటాడని భావిస్తున్నారు.

రాయుడిని పక్కన పెట్టింది ఆ ఇద్దరేనా?

అయితే టీమిండియా జట్టులోకి అంబటి రాయుడిని తీసుకోకపోవడం వెనక టీమిండియా మేనేజ్ మెంట్ కీలక పాత్ర పోషించిందని అంటున్నారు. విజయ శంకర్ స్థానంలో టీమిండియా జట్టులోకి అంబటి రాయుడిని తీసుకోకపోవడం వెనక కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ఉన్నట్లు తెలుస్తోంది.

విజయ శంకర్ స్థానంలో తమకు మాయాంక్ అగర్వాల్ కావాలని వారు పట్టుబట్టినట్లు సమాచారం. అందుకే అంబటి రాయుడిని కాకుండా మాయాంక్ అగర్వాల్ ను బిసిసిఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మాయాంక్ అగర్వాల్‌ ఎంపికలో బీసీసీఐ సెలెక్టర్ల ప్రమేయం ఏమీ లేదని, విజయ శంకర్ స్థానంలో తమకు మాయాంక్ అగర్వాల్ కావాలని టీమ్ మేనేజ్ మెంట్ పట్టుబట్టిందని, అందుకే రాయుడు కాకుండా మాయాంక్ ను ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించుకుంది అని అంటున్నారు.

చదవండి: సెంచరీతో చెలరేగిన రోహిత్…చిరకాల ప్రత్యర్ధిని చిత్తు చేసిన టీమిండియా

మరోవైపు, మాయాంక్ అగర్వాల్ కూడా ఇండియా-ఎ టీమ్‌లో అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. కర్ణాటకకు చెందిన మాయాంక్ కేవలం నాలుగు మ్యాచ్‌లలో 287 పరుగులు చేశాడు. అతడి సగటు రన్ రేట్ 71.75గా ఉండగా, స్ట్రయిక్ రేట్ 105.90గా ఉంది. 2018లో ఇంగ్లాండు, వెస్టిండీస్‌లతో ఇండియా-ఎ ముక్కోణపు పోటీల్లో కనబరిచిన ప్రదర్శన కూడా మాయాంక్ అగర్వాల్ ఎంపికకు కారణమై ఉండొచ్చని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదీ రాయుడి క్రికెట్ కెరీర్…

క్రికెట్‌ కెరీర్‌లో 55 వన్డేలు ఆడిన అంబటి రాయుడు 1,694 పరుగులు చేశాడు. ఆరు అంతర్జాతీయ టీ20లు ఆడి 42 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో అయితే 147 మ్యాచ్‌ల్లో 3,300 పరుగులు చేశాడు. చివరిగా ఐపీఎల్‌ -2019లో చెన్నై సూపర్‌ కింగ్స్ తరఫున 17 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 282 పరుగులు చేశాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 97 మ్యాచ్‌ల్లో 156 ఇన్నింగ్స్‌లో 6,151 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో రాయుడు వ్యక్తిగత అత్యధిక స్కోరు 210 పరుగులు. లిస్ట్‌-ఏలో 160 మ్యాచ్‌లు ఆడి 5,103 పరుగులు చేశాడు. అలాగే 216 టీ20 మ్యాచ్‌లు ఆడి 4,584 పరుగులు చేశాడు.

2013 జులై 24న టీమిండియా-జింబాబ్వే మధ్య జరిగిన వన్డేల్లో అరంగేట్రం చేసిన రాయుడు.. చివరగా ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఆడాడు. 2014లో తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు. 2016లో జింబాబ్వేతో జరిగిన టీ20నే అతడికి ఆఖరిది. ఈ ఏడాది మార్చిలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున చివరిసారిగా ఆడాడు.

ఆది నుంచీ వివాదాలే…

రాయుడు.. తొలినాళ్లలోనే అప్పటి హెచ్‌సీఏ బాస్ శివ్‌పాల్ యాదవ్‌పై ఆరోపణలు చేశాడు, ఆ తర్వాత బీసీసీఐ బ్యాన్ చేసిన ఐసీఎల్ తరఫున ఆడాడు. ఇక, ఈ వరల్డ్ కప్ 2019 కోసం జట్టును ప్రకటించాక.. తాను ఎంపిక కాలేదని తెలిసి.. బీసీసీఐకి చురక అంటేలా ట్వీట్ చేశాడు.

ఈ వరల్డ్ కప్ చూడ్డానికి 3డీ గ్లాసెస్ ఆర్డర్ చేశానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తనను కాకుండా విజయ్ శంకర్ ను ఎంపిక చేయడంపై రాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బహుశా ఈ ట్వీట్ కారణంగానే ఆగ్రహంతో ఉన్న బీసీసీఐ అతడ్ని జట్టులోకి తీసుకోకపోయి ఉండకపోవచ్చని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: భారత్-పాక్ మ్యాచ్‌కు వరుణ గండం…!