నాలుగో స్థానంలో పంత్ వద్దు.. కోహ్లీ వ్యాఖ్యలపై సునీల్ గవాస్కర్ ఫైర్

5:26 pm, Mon, 12 August 19

న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ మరోసారి నిరాశపరచగా, ఐదో స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (71) అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.

కోహ్లీతో కలిసి సంయమనంతో ఆడాడు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు.అయితే, నాలుగో స్థానంలో రిషభ్ పంత్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్టు కెప్టెన్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఖండించాడు. నాలుగో స్థానంలో పంత్ కంటే శ్రేయరే బెటరన్నాడు.

ధోనీలాంగే పంత్ కూడా ఐదు, లేదంటే ఆరు స్థానాల్లో ఆడడమే మంచిదని, అతడి ఆటతీరుకు అవే చక్కగా సరిపోతాయని అన్నాడు. ధవన్, రోహిత్, కోహ్లీలు 40 ఓవర్లపాటు ఆడితే అప్పుడు పంత్ నాలుగో స్థానంలో రావొచ్చని, అలా కాకుండా 30-35 ఓవర్లకే టాప్ ఆర్డర్ కుప్పకూలితే శ్రేయాస్ అయ్యర్‌ను ముందు పంపాలని కోరాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడని గవాస్కర్ ప్రశంసించాడు.