సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు భారత జట్టు ప్రకటన.. పంత్‌కు మొండిచేయి

4:29 pm, Tue, 1 October 19

విశాఖపట్నం: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య బుధవారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ధోనీ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై వేటేసిన మేనేజ్‌మెంట్ వృద్ధిమాన్ సాహాకి అవకాశం ఇచ్చింది.

సాహా ఇప్పటివరకు 32 టెస్టుమ్యాచ్‌లు ఆడాడు. 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో మొత్తం 1164 పరుగులు చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. సాహా అత్యుత్తమ కీపర్ అని అన్నాడు. గాయం కారణంగా చాలారోజులు ఆటకు దూరమైనా గతంలో భారత జట్టుకు అతడు అందించిన సేవలు పరిగణనలోకి తీసుకుని అతడ్ని ఎంపిక చేశామని చెప్పాడు. 

ఇటీవల విండీస్‌ పర్యటనలో రిషభ్ పంత్ ఘోరంగా విఫలం కావడంతో అతడిపై వేటు తప్పదని ముందే భావించారు. మంగళవారం కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయమే వెల్లడించాడు.

రిషభ్ పంత్‌‌ను పక్కన పెట్టడంపై విరాట్ మాట్లాడుతూ.. పంత్‌కు అవకాశం ఇవ్వాలని భావించినా.. ఉన్నపళంగా అతడు రాణించాలని తాము భావించడం లేదని, విదేశాల్లో అతడు ఎలా రాణిస్తాడో చూశాక.. అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పాడు. 

తొలి టెస్టుకు భారత జట్టు ఇదే…

విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ.