మలింగ దెబ్బకు కివీస్ విలవిల.. బోల్డన్ని ప్రపంచ రికార్డులు సృష్టించిన శ్రీలంక పేసర్

1 week ago
పల్లెకెలె: న్యూజిలాండ్‌తో పల్లెకెలెలో జరిగిన మూడో టీ20లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ చెలరేగిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లను రెండుసార్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
 
36 ఏళ్ల మలింగ న్యూజిలాండ్ ఆటగాడు కోలిన్ మన్రో (12), హమీష్ రూథర్‌ఫర్డ్ (0), కోలిన్ డి గ్రాండ్‌హో‌మ్ (0), రాస్ టేలర్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ పంపాడు.
 
ఈ హ్యాట్రిక్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదుసార్లు హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాదు, టీ20ల్లో వంద వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్‌గానూ రికార్డులకెక్కాడు.
 
ఈ క్రమంలో పాక్ మాజీ స్పిన్నర్ షాహిద్ అఫ్రిది (97) పేరుపై ఉన్న రికార్డును బద్దలుగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
 
అనంతరం 126 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్.. మలింగ దెబ్బకు విలవిల్లాడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో మలింగ మ్యాజిక్ ప్రారంభమైంది.
 
మూడో ఓవర్ మూడో బంతికి మన్రోను బౌల్డ్ చేసిన మలింగ.. రెండో బంతికి రూథర్‌ఫర్డ్, మూడో బంతికి గ్రాండ్‌హోమ్, నాలుగో బంతికి రాస్ టేలర్‌లను వరుసగా పెవిలియన్ పంపాడు.
 
మలింగ దెబ్బకు కివీస్ బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. 16 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలి 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.