న్యూజిలాండ్ Vs భారత్: రెండో టీ20లో రోహిత్ మెరుపులు.. టీమిండియా ఘనవిజయం!

rohith sharma headlights in t20

rohitsharma

న్యూజిలాండ్ తో ఆక్లండ్ లో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 159 పరుగుల విజయలక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. తద్వారా సిరీస్ ను 1-1తో సమం చేసింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కివీస్ బౌలర్లపై మొదటినుండి ఎదురుదాడికి దిగాడు. 29 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అర్ధశతకంతో అదరగొట్టిన రోహిత్ శర్మ..

మొదట టాస్ గెలిచిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్ మెన్లలో గ్రాండ్ హోమ్ 50, టేలర్ 42 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కృణాల్ పాండ్యా 3, అహ్మద్ 2 వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం 159 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్ లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలసి 9.2 ఓవర్లలో 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 50 పరుగులు చేసిన తర్వాత సోధీ బౌలింగ్ లో సౌథీకి క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు.

అనంతరం మరో వికెట్ కోల్పోకుండా పంత్, ధోనీలు భారత్ ను విజయతీరాలకు చేర్చారు. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన కృణాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

అలాగే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ రెండు ఘనతలను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా (2,288) అవతరించాడు. ఇదే సమయంలో టీ20ల్లో అత్యధిక 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డును సాధించాడు. రోహిత్ ఈ ఘనతను 20 సార్లు సాధించాడు.