పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీ రేంజ్‌లో షాకిచ్చిన ఐసీసీ.. ఊపిరిపీల్చుకున్న బీసీసీఐ

12:00 pm, Wed, 21 November 18
ICC Rejects Pakistan’s Compensation Claim Against BCCI

ICC Rejects Pakistan’s Compensation Claim Against BCCI

హైదరాబాద్: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)తో ఉన్న వివాదంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)కి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజా తీర్పుతో భారీ షాక్‌ తగిలింది.

రెండు దేశాల బోర్డుల మధ్య కుదిరిన ద్వైపాక్షికి సిరీస్‌ల ఒప్పందాన్ని బీసీసీఐ ఉల్లంఘించిందని, అందువల్ల తమకు 7 కోట్ల డాలర్ల (సుమారు రూ.445 కోట్లు) నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు తొలుత పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఫిర్యాదు చేసింది.

దీనిపై రెండు దేశాల బోర్డుల వాదనలు విన్న తర్వాత పీసీబీ వాదనను తమ వివాదాల కమిటీ తోసిపుచ్చినట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం తన తుది తీర‍్పును వెల్లడించింది.

అంతేకాదు, ఈ తీర్పే ఫైనల్ అని, దీనిపై అప్పీల్ చేసే అవకాశం కూడా లేదని క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ప్రధానంగా ఇరు జట్ల మధ్య చేసుకున్న ఒప్పందంలో భాగంగా రాసుకున్న ఎమ్‌ఓయూ.. ఒక ప్రపోజల్‌ లెటర్‌ లాంటిదని బీసీసీఐ వాదించింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎలా ఆడతామనే వాదనను బలంగా వినిపించింది.

రూ. 445 కోట్లను చెల్లించనక్కర్లేదు…

భారత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాల్సి ఉన్నా.. భారత ప్రభుత్వం తిరస్కరించడంతో బీసీసీఐకి మరో దారి లేకుండా పోయింది. ఇదే అదనుగా ఒప్పందం ఉల్లంఘన కారణంగా తమకు జరిగిన నష్టాన్ని పరిహారంతో పూడ్చాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది.

అయితే పీసీబీ డిమాండ్ చేసిన రూ. 445 కోట్లను చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా ఐసీసీ వివాదాల కమిటీ తీర్పు చెప్పింది.

అక్టోబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్య ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ వాదనలు వినిపించాయి. మూడు రోజుల పాటు జరిగిన విచారణలో రెండు బోర్డులు సమర్పించిన లిఖితపూర్వక నివేదికలను పరిశీలించిన తర్వాత పీసీబీ వాదనను కొట్టేస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2013లో చివరిసారి పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. ఇక టెస్ట్ సిరీస్ విషయానికొస్తే.. 2007 తర్వాత రెండు దేశాల మధ్య మళ్లీ జరగనేలేదు.