ధోనీ గ్లోవ్స్‌ వివాదంపై వెనక్కి తగ్గుతున్న ఐసీసీ

9:13 am, Sat, 8 June 19

దుబాయ్: వరల్డ్ కప్‌లో  5వ తేదీన భారత్-సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ధరించిన గ్లోవ్స్ పై ఐసీసీ అడ్డుచెప్పడం పట్ల బీసీసీఐ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

దీనిపై తాము ఇంతకుముందే ఐసీసీ అనుమతి కోరామని, ఐసీసీతో సమావేశమై గ్లోవ్స్ అంశంపై మరింత విపులంగా చర్చిస్తామని బీసీసీఐ పాలకమండలి చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. ఇక దీనిపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సైతం స్పందిస్తూ….. బలిదాన్ గుర్తులున్నంత మాత్రాన ధోనీ గ్లోవ్స్ పై అభ్యంతరం చెప్పాల్సిన అవసరంలేదన్నారు. “బలిదాన్ గుర్తు ఏమైనా వాణిజ్య పరమైన గుర్తా? అది జాతి గౌరవానికి సంబంధించిన చిహ్నం. దీన్ని ఐసీసీ విశాలదృక్పథంతో చూడాలి” అంటూ వ్యాఖ్యలు చేశారు.

కాగా, తమపై తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ఐసీసీ వర్గాలు ధోనీ గ్లోవ్స్ వివాదంపై వెనక్కి తగ్గుతున్నాయి. ధోనీ గ్లోవ్స్ పై ఉన్న చిహ్నాలను తొలగించాలని బీసీసీఐకి సూచించామని, దానిపై బీసీసీఐ వివరణ ఇచ్చిందని ఐసీసీ జనరల్ మేనేజర్ క్లైరే ఫర్లాంగ్ తెలిపారు. బీసీసీఐ స్పందనను ఐసీసీ హైకమాండ్ దృష్టికి తీసుకెళతామని, తుదినిర్ణయం వాళ్లే తీసుకుంటారని ఫర్లాంగ్ స్పష్టం చేశారు.

చదవండి: ధోనీ దేశభక్తి: గ్లోవ్స్‌పై ఆర్మీ సింబల్..తొలగించాలని ఐసీసీ ఆదేశాలు