వరల్డ్ కప్ 2019: భారత్ Vs న్యూజిలాండ్ సెమీఫైనల్: పోరాడి ఓడిన టీమిండియా!

5:45 pm, Wed, 10 July 19
world-cup-2019-india-vs-newzealand-semi-finals-match

మాంచెస్టర్: క్రికెట్ ప్రపంచ కప్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. సెమీఫైనల్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో రోజైన బుధవారం టీమిండియా న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి చతికిలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి కోహ్లీ సేన న్యూజీలాండ్ చేతిలో ఓటమి పాలైంది. 

ప్రపంచ కప్ 2019లో లీగ్ దశలో అగ్రగామిగా నిలిచి సెమీఫైనల్‌కు దూసుకొచ్చిన భారత జట్టు.. ఫైనల్‌కు ఒక్క అడుగు దూరంలో అందరినీ నిరాశపర్చింది. న్యూజీలాండ్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌట్ అయి ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.

అసలు బుధవారం ఏం జరిగిందంటే…

మంగళవారం వర్షం కారణంగా బుధవారానికి వాయిదా పడిన భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్స్ బుధవారం ప్రారంభమైంది. మంగళవారం ఆటను వాయిదా వేసే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయడం, ఆ జట్టు బ్యాట్స్‌మన్లు టేలర్ 67, లత్హామ్‌ 3 పరుగులతో క్రీజ్‌లో ఉండడం తెలిసిందే.

239 పరుగులు చేసిన న్యూజిలాండ్…

ఓవైపు వికెట్లు పడుతున్నా టేలర్ క్రీజ్‌లో పాతుకుపోవడంతో పాటు ధాటిగా ఆడుతుండడంతో న్యూజిలాండ్ అభిమానులు అతడిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే బుధవారం ఆట మొదలవగానే.. ఆరంభం నుండే ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన టేలర్(74 పరుగులు) అనూహ్యంగా రనౌటయ్యాడు. దీంతో 225 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఐదో వికెట్ పడింది.

ఆ వెంటనే భువీ బౌలింగ్‌లో లాథమ్, హెన్రీలు కూడా వెంటవెంటనే పెవిలియన్ ముఖం పట్టగా, న్యూజిలాండ్ ఇవాళ నాలుగు ఓవర్లలో మరో 28 పరుగులు మాత్రమే జోడించి.. మొత్తంగా కివీస్ 239 పరుగులు చేసి టీమిండియా ముందు 240 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో భారత్ ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరాలంటే 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వుంది.

240 పరుగుల టార్గెట్‌తో టీమిండియా బరిలోకి…

అనంతరం 240 పరుగుల ఛేదన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ విజృంభణకు భారత ఓపెనర్లు చిత్తయ్యారు. దీంతో తొలి నాలుగు ఓవర్లలోనే భారత్ వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఒక్కొక్క పరుగుకే వెనుదిరిగారు.

మొదటి ఓవర్ ముగిసేటప్పటికి వికెట్ కోల్పోకుండా 2 పరుగులు చేసిన టీమిండియాకు ఆ తరువాత షాక్ మీద షాక్ తగిలింది. హెన్రీ బౌలింగ్ రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ లత్హామ్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం నాలుగు బంతులాడిన రోహిత్ ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

షాక్.. తొలి 5 పరుగులకే 3 వికెట్లు డౌన్…

దీంతో తొలి 5 పరుగులకే టీమిండియా 3 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (1)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. బౌల్ట్ బౌలింగ్‌లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

రోహిత్ శర్మను మాట్ హెన్రీ అవుట్ చేయగా, కోహ్లీని ట్రెంట్ బౌల్ట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. డీఆర్ఎస్‌లో కూడా కోహ్లీ అవుట్ అని తేలడంతో టీమిండియా శిబిరం నిర్ఘాంతపోయింది.

ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా ఒక్క పరుగుకే అవుటయ్యాడు. తర్వాత దినేశ్ కార్తీక్ వచ్చాడు. అప్పటికి 4 ఓవర్లు పూర్తి కాగా టీమిండియా స్కోరు 3 వికెట్లకు 5 పరుగులు.

అనంతరం దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ వికెట్లు కాపాడుకుంటూ కాసేపు ఆడినా ఆ భాగస్వామ్యం కూడా ఎంతోసేపు నిలవలేదు. పదో ఓవర్ చివరి బంతికి దినేశ్ కార్తీక్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 24 పరుగులే. ఇలా ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం టీమిండియాకు పెద్ద షాక్‌లా మారింది.

పేస్‌కు అనుకూలించిన పిచ్?

మంగళవారం భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఇక్కడి పిచ్ పేస్‌కు అనుకూలిస్తున్నట్టు తెలుస్తోంది. 240 పరుగుల లక్ష్యఛేదనలో 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా కాసేపటికే నాలుగో వికెట్ చేజార్చుకుంది. కివీస్ పేసర్ మాట్ హెన్రీ నిప్పులు చెరిగే బౌలింగ్ తో టీమిండియాకు అగ్నిపరీక్ష పెడుతున్నాడు.

దినేశ్ కార్తీక్ (6) కాస్త నిలదొక్కుకుంటున్నాడు అనుకునేంతలోనే హెన్రీ విసిరిన ఆఫ్ సైడ్ బంతిని వెంటాడి అతడు అవుటయ్యాడు. టీమిండియా 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేయగా, క్రీజులో రిషబ్ పంత్ (19), హార్దిక్ పాండ్యా (5) ఆడుతున్నారు.

పంత్, పాండ్యా ఆచితూచి ఆడుతూ…

ఆ దశలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలు ఆచితూచి ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. పాండ్యా తన సహజశైలికి భిన్నంగా ఆచితూచి ఆడడంతో జట్టు స్కోరు కూడా నెమ్మదిగానే ముందుకు సాగింది. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.

అంతలోనే మళ్లీ షాక్.. స్పిన్నర్ శాంట్నర్ టీమిండియా ఆశలకు విఘాతం కలిగిస్తూ పంత్‌ను బుట్టలో వేశాడు. ఇన్నింగ్స్ 23వ ఓవర్లో.. సాంట్నర్ వేసిన ఓ బంతిని ఆడిన రిషబ్ పంత్ గ్రాండ్‌హామ్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆ జోడీకి కూడా బ్రేక్ పడింది.

ఇక భారమంతా ధోనీ, హార్దిక్‌ల పైనే…

పంత్ అవుట్ అవడంతో ధోనీ మైదానంలోకి అడుగుపెట్టాడు.  దీంతో భారత అభిమానులు ధోనీపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 28 ఓవర్లలో 5 వికెట్లకు 83 పరుగులు. క్రీజులో హార్దిక్ పాండ్యా, ధోనీ ఆడుతున్నారు. భారత్ గెలవాలంటే ఇంకా 22 ఓవర్లలో 157 పరుగులు చేయాల్సి ఉండగా, భారమంతా ప్రస్తుతానికి ధోనీ, హార్దిక్‌ల పైనే ఉంది.

అయితే పంత్ తరువాత 31వ ఓవర్లో హార్ధిక్ పాండ్యా కూడా సాంట్నర్ బౌలింగ్‌లోనే విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 92 పరుగులు. ఆ తరువాత ధోనీకి తోడుగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు.

ఆశలు రేపిన జడేజా, కానీ…

రవీంద్ర జడేజా క్రీజ్‌లో ఉన్నంతసేపు పరుగుల వరద పారించాడు. దీంతో టీమిండియా అభిమానుల్లో గెలుపు ఆశలు కలిగాయి. 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో రవీంద్ర జడేజా 77 పరుగులు చేశాడు. 

ధోనీతో కలిసి జడేజా మంచి భాగస్వామ్యం అందించాడు. ఏడో వికెట్‌కు వారిద్దరూ 116 పరుగులు జోడించిన తరువాత 48వ ఓవర్లో బోల్ట్ బౌలింగులో జడేజా భారీ షాట్‌కు ప్రయత్నించి విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

ఇక ‘మ్యాచ్ ఫినిషర్‌’పైనే భారం…

జడేజా అవుటయ్యేటప్పటికి భారత్ 13 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన పరిస్థితి. మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న ధోనీ క్రీజులో ఉండడంతో అభిమానుల్లో ఆశలు మిణుకుమిణుకుమన్నాయి.

కానీ.. జట్టు స్కోరు 216 పరుగుల వద్ద ధోనీ రనవుట్ అయ్యాడు.  72 బంతులాడిన ధోనీ ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు.  ఆ తరువాత వచ్చిన భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్ వెంట వెంటనే అవుట్ కావడంతో టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది.

నిరాశపరిచినా.. ఆ పోరాట స్ఫూర్తి నచ్చింది: ప్రధాని మోడీ

క్రికెట్ ప్రపంచకప్‌ సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవడంపై అభిమానులు నిరాశపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఫలితం నిరాశపరిచిందంటూ ట్వీట్ చేశారు.  

అయితే, విజయం కోసం చివరి వరకు టీమిండియా చేసిన పోరాటం తనకు నచ్చిందన్నారు. టోర్నీ యావత్తూ భారత్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగులో రాణించడం గర్వకారణమన్నారు. గెలుపు ఓటములు జీవితంలో భాగమంటూ.. భవిష్యత్ మ్యాచ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.