అంబటి రాయుడిపై సానుభూతి.. బీసీసీఐపై వెల్లువెత్తిన ఆగ్రహ జ్వాల

9:14 pm, Wed, 3 July 19

హైదరాబాద్: ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టులో స్థానం ఆశించిన భంగపడిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. గాయపడిన విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయడంతో తీవ్ర నిర్వేదానికి గురైన రాయుడు తన క్రికెట్ ప్రస్థానానికి ముగింపు చెప్పేశాడు.

రాయుడి వీడ్కోలు మాజీ క్రికెటర్లను షాక్‌కు గురిచేసింది. రాయుడిని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతుండగా, రాయుడిపై సానుభూతి వెల్లువలా వచ్చిపడుతోంది. రిటైర్మెంట్ తర్వాత రాయుడి జీవితం బాగుండాలని కోరుకుంటున్నట్టు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు అంబటి రాయుడు గుడ్ బై! తీవ్ర అసంతృప్తిలో రాయుడు.. కారణమెవరు?

టీమిండియా మరో మాజీ ఓపెనర్, ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ అయితే సెలక్టర్లపై మండిపడ్డాడు. రాయుడి లాంటి ప్రతిభావంతుడిని ఎంపిక చేయకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని ట్వీట్ చేశాడు. ఇది నిజంగా సిగ్గుచేటైన విషయమన్నాడు. టైటిళ్లు గెలవడం ముఖ్యమే అయినా హృదయాలను గెలవడం ఇంకా ముఖ్యమంటూ ఘాటుగా స్పందించాడు.

ఐదుగురు సెలెక్టర్లు చేసిన పరుగులను కలిపినా రాయుడు చేసిన పరుగులకు సమానం కాదంటూ గంభీర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. 3 సెంచరీలు 10 హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడు రిటైర్ కావడం భారత క్రికెట్‌కు దుర్దినమని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

‘‘రాయుడి బాధను అర్థం చేసుకోగలను..’’

భారత జట్టులో చోటు దక్కకపోవడం రాయుడిని బాధించిందని, అతడి ఆవేదనను, బాధను తాను అర్థం చేసుకోగలనని హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆనందం, మనశ్శాంతి అతడి సొంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నాడు.

క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా రాయుడి రిటైర్మెంట్‌పై స్పందించాడు. రాయుడు ఎప్పుడూ తన శక్తిమేర ఆడాడని, కానీ తప్పుడు చాయిస్ కారణంగా క్రికెట్‌కు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇవి భావోద్వేగ క్షణాలు, కానీ రేపు అనేది ఒకటి ఉంటుందని భోగ్లే పేర్కొన్నాడు.