చెత్తను సేకరించి.. యాషెస్ కలను నెరవేర్చుకున్న 12 ఏళ్ల బుడతడు!

1:42 pm, Sat, 7 September 19

మాంచెస్టర్: పట్టుదల ఉండాలే కానీ అడ్డుగోడలను సైతం బద్దలుగొట్టుకుంటూ ముందుకు సాగవచ్చని నిరూపించాడో 12 ఏళ్ల బాలుడు. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ఆస్ట్రేలియాకు చెందిన 8 ఏళ్ల బాలుడు మ్యాక్స్ వెయిట్‌కి కూడా అంతే. స్టేడియంలో కూర్చుని మ్యాచ్‌లను చూడాలని ఒకటే కోరిక. కానీ అందుకు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. కానీ మ్యాచ్‌లను చూడాలన్న కోరికను మాత్రం చంపుకోలేకపోయాడు.

కండిషన్ పెట్టిన తండ్రి

యాషెస్ సిరీస్ వస్తోందంటే చాలు టీవీకి అతుక్కుపోయే మ్యాక్స్.. ఓ రోజు ధైర్యం చేసి తన కోరికను తండ్రి డేమియన్‌ ముందు బయటపెట్టేశాడు. కుమారుడి కోరికను విన్న అతడికి కూడా చిన్నారి కోరికను తీర్చాలనే అనుకున్నాడు. అయితే, ఇందుకోసం ఓ చిన్న షరతు పెట్టాడు. 1500 డాలర్లు సంపాదించి చూపిస్తే మ్యాచ్‌లకు తీసుకెళ్తానని షరతు పెట్టాడు.

చెత్త బుట్టలను డంప్ చేసి..

1500 డాలర్లు సంపాదించమని తండ్రి సరదాకే అన్నాడో, నిజంగానే అన్నాడో ఎనిమిదేళ్ల ఆ పసివయసుకు అర్థం కాలేదు. కానీ అతడు మాత్రం సీరియస్‌గానే తీసుకున్నాడు. తన ఇంటి చుట్టుపక్కల పది ఇళ్ల యజమానులకు లేఖలు రాశాడు. వారింట్లోని చెత్త బుట్టలను తాను తీసుకెళ్లి ఖాళీ చేస్తానని ఆ లేఖలో రాసుకొచ్చాడు. అందుకోసం వారానికి ఒక డాలర్ ఇస్తే చాలని పేర్కొన్నాడు. చిన్నారి లేఖను చదివి తన కలను నెరవేర్చుకునేందుకు అతడు ఎంచుకున్న మార్గానికి అందరూ ఫిదా అయిపోయారు. సరేనంటూ తమ అంగీకారాన్ని తెలియజేశారు.

నాలుగేళ్ల కష్టం

8 ఏళ్ల వయసులో చెత్త సేకరణ మొదలుపెట్టిన మ్యాక్స్ వెయిట్ నాలుగేళ్లు కష్టపడి 12 ఏళ్లకు తండ్రి చెప్పిన 1500 డాలర్లు కూడబెట్టాడు. అవి తీసుకెళ్లి నేరుగా తండ్రి చేతిలో పెట్టాడు. కుమారుడి పట్టుదల చూసి తండ్రి డేమియన్ కళ్లు అప్రయత్నంగానే వర్షించాయి. కుమారుడిని హత్తుకుని అతడి కలను నెరవేర్చేందుకు నేరుగా ఇంగ్లండ్ తీసుకెళ్లి ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌ను దగ్గరుండి చూపించి కొడుకు ముచ్చట తీర్చాడు.

క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతున్న పేరు

యాషెస్ సిరీస్ చూసేందుకు చిన్నారి మ్యాక్స్ చేసిన సాహసం, పట్టుదల గురించి బయటకు రావడంతో స్టేడియంలోని ప్రేక్షకులే కాదు, కామెంటేటర్లు, క్రికెటర్లు కూడా ఫిదా అయిపోయారు. కామెంటేటర్లు స్టేడియంలోనే అతడిని ఇంటర్వ్యూ చేశారు. అది చూసి యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది. ఇప్పుడు మ్యాక్స్ పేరు మార్మోగిపోతోంది. చెత్తను సేకరించేందుకు తనకు రోజుకు 20 నిమిషాలు మాత్రమే పట్టేదని మ్యాక్స్ పేర్కొన్నాడు. ఇప్పుడీ చిన్నారి ఇంటర్వ్యూల కోసం మీడియా క్యూకడుతోంది.