ఈ సినిమాల ఫెయిల్యూర్స్ బాధ్యత ఎవరిది? తీసేవారిదా? చూసేవారిదా?

naa-peru-surya
- Advertisement -

naa-peru-sachin

‘అబ్బే ఏం సినిమాలండీ.. అస్సలు వేల్యూస్ లేవు.. ఎంత సేపూ డ్యాన్సులు, ఫైటింగులేనా?

ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు ఏడాదికి ఒకట్రెండు అయినా వస్తున్నాయా? అసలు దేశభక్తీ మీద తీసే సినిమాలు తెలుగులో ఉన్నాయా? ఆ సంగతి పక్కన పెట్టండి..  దేశాన్ని కాపాడే..సైనికుడికి సంబంధించిన సినిమా ఒక్కటైనా వచ్చిందా? తీస్తే హిందీలో తీస్తారుగానీ.. తెలుగులో వచ్చాయా? అబ్బే.. ఇండస్ట్రీ పాడైపోయిందండీ..

ప్రొడ్యూసర్లకి డబ్బులు కావాలి.. ప్రేక్షకులకి మసాలా కావాలి.. ఆ..ఆ.. పాటేమిటండీ.. ఆ.. కెవ్వు కేక.., ఇంకా.. జిల్ జిల్ జిల్… జిగేల్ రాణి… ఈ పాటలుంటే చాలదా? అసలీ రోజుల్లో దేశభక్తి ఎవడికి కావాలండీ…?

సార్.. సార్.. ఇంకాపండి.. రైలు ప్రయాణాల్లో, కాఫీ క్లబ్బుల్లో, తప్పతాగే పబ్బుల్లో, ఆఫీసుల్లో, ఇళ్లల్లో, ఊళ్లల్లో, రచ్చబండల దగ్గర, పొద్దున్నే వాట్సాప్, ఫేస్‌బుక్ లు, సోషల్ మీడియాలో ఊదరగొడుతూ.. దేశభక్తిపై చొక్కాలు చింపేసుకుంటూ, ఆవేశాలు పెంచుకుంటూ, గుండెలు బాదుకుంటూ మాటలాడుకునే మాటలు.. నిత్యం పఠించే ఈ పడికట్టు డైలాగులను.. కాసేపు ( ఈ ఆర్టికల్ చదువుతున్నంత సేపు )  పక్కన పెట్టండి.

ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి.. వాళ్లు తీయడం లేదు.. వాళ్లు తీయడం లేదు.. అని సినిమా వాళ్ల మీద కామెంట్ చేయడం కాదు. మరి వారు తీసిన సినిమాని మనం చూశామా? ఆదరించామా? తిరిగి మరో గొప్ప సినిమా తీసేలా వారిలో ప్రేరణ కలిగిస్తున్నామా? సినిమా సంగతి పక్కన పెట్టండి.. ఆ తీసిన వారిలో కనీసం ఇన్‌స్పిరేషన్ కోసమైనా.. ‘ఇది దేశం కోసం తపన పడే ఒక సైనికుడి కథ.. ఎలా ఉందో ఒకసారి చూద్దాం..’ అని ఎంతమంది అనుకున్నారు.

ఎంతసేపూ వారివైపు నుంచి ఆలోచించడమేనా? మనవైపు నుంచి ఆలోచించమా?

కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి..ఏడాదిపైనే సినిమా కోసం శ్రమ పడి.. కొండకోనల్లో, అతిశీతల మంచుపర్వతాలతో నిండిన ఇండియా బోర్డర్లో, ఎంతో కష్టసాధ్యమైన మిలట్రీ అధికారుల అనుమతులు సంపాదించి, వారు పెట్టే నిబంధనలను అధిగమించి మన తెలుగు వాళ్లు కూడా ఒక సినిమా తీశారు.  దాని పేరు..

‘నా పేరు సూర్య… నా ఇల్లు ఇండియా’ ( ఆదివారం ఓ టీవీ చానల్లో కూడా వచ్చింది.. )

మీకు తెలుసా? హీరో అల్లు అర్జున్.. ఈ సినిమా కోసం ఎంతో కష్టసాధ్యమైన మిలట్రీ శిక్షణలు పొంది.. వళ్లు హూనం చేసుకొని.. ఆ సైనికుల బాడీ లాంగ్వేజ్ అదీ అర్థం చేసుకొని.. పనిచేశాడని.

ఇది ఒక భారతదేశపు సైనికుడికి సంబంధించిన సినిమా..సైనికుల గురించి వాట్సాప్ లలో, ఫేస్ బుక్కుల్లో, ఆగస్టు 15, డిసెంబరు 26, గాంధీజయంతి ఇలాంటి రోజుల్లో అపరిమితమైన దేశభక్తితో లైకుల మీద లైకులు కొట్టే , షేరులు మీద షేరులు చేసే.. ఇన్ని కోట్ల మంది ఆంధ్రులు..టిక్కెట్టు కొని ఎలా ఉందో చూద్దామని ఒక సైనికుడికి సంబంధించిన సినిమాకి వెళ్ల లేకపోయారు.                                                     

ఎందరో వాట్సాప్ మహానుభావులు..అందరికీ వందనాలు..

ఎవరో చూసినవాళ్లు అనవసరం అని అనుంటారు..అతని అభిప్రాయమే..మీ అభిప్రాయమా.. అతని అభిప్రాయాన్ని గౌరవించే.. ఆగస్టు 15న అందరికి శుభాకాంక్షలు చెబుతారా.. అతని అభిప్రాయంతోనే  రోజంతా పనిచేస్తరా? సినిమా విషయంలో మీ సొంత అభిప్రాయాన్ని ఎందుకు ఉంచుకోరు..ఏమో మీరడిగిన వ్యక్తికి మహేష్ బాబు అంటే ఇష్టమేమో..ఆరోజు అతనికెన్ని అవమానాలు జరిగాయో.. ఎవరికి తెలుసు.. అందుకే ఎక్కడైనా మీ  ఇండివిడ్యువాలిటీని కాపాడుకోండి..మీ సొంత వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి.. మీ క్యారెక్టర్ని కాపాడుకోండి.. అదే ఈ సినిమా..

నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా..

ఈ సినిమాలో పాయింట్ అదే మాస్టారూ..అందుకే మొదట కొంచెం అలా రాయాల్సి వచ్చింది. ( పాఠకులు క్షమించాలి.. )

ఎన్ని కష్టాలైనా రానివ్వండి.. మన సొంత వ్యక్తిత్వం (క్యారెక్టర్) ఏదైతే ఉందో.. దానిని కాపాడుకోవాలి..

అన్ని సినిమాలు చూడమని చెప్పడం లేదు. ఇది దేశభక్తికి, ఒక సైనికుడికి సంబంధించిన సినిమా కదా..ఎందుకంటే సినిమా గురించి కాదు.. అది ఎలాగైనా తీయనివ్వండి.. లాభాపేక్ష లేకుండా తీసిన ఆ సినిమా యూనిట్ సభ్యులను అభినందించడానికైనా థియేటర్ కి వెళ్లి చూడాలి. మళ్లీ ఇంకొకరు అలాంటి సినిమా తీయాలనే ఉత్సాహం, ప్రోత్సాహం కలిగించడానికైనా చూడాలి.

ఇప్పుడేం జరిగిందంటే..మనం చూడకపోవడం వల్ల..  దేశం మీద, ఒక సైనికుడిపై సినిమా తీయాలంటే నిర్మాతలు భయపడటమో, ఆలోచించడమో చేసే పరిస్థితి కల్పించామనే చెప్పాలి.   కథ ఒక సోల్జర్ కి సంబంధించినది.. రెండు ఆ సోల్జర్ లో ఉన్న కోపం.. ఒక  ఆవేశం తగ్గించే క్రమంలో.. సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా..చుట్టూ అల్లారు.

అక్కడక్కడ మసాలా ఉన్నా.. నేపథ్యం ఆర్మీ ఉండటం వల్ల కొంచెం సంయమనం పాటించారు. అంతే దెబ్బ పడిపోయింది. సైనికులైనా సరే.. మాస్ ఉండాల్సిందే..మసాలా సీన్లు పండాల్సిందే.

ఈ సినిమా ఎందుకు నచ్చలేదు.. ఒక విశ్లేషణ…

ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్.. అతని పేరే సూర్య..గుండెల నిండా దేశభక్తిని నింపుకున్న ఒక సైనికుడు..అయితే అతనికి కోపం ఎక్కువ. దాంతో ఆర్మీలో సస్పెండ్ అవుతాడు. కానీ ఒక సైక్రియాట్రిస్ట్ సర్టిఫై చేస్తే అతన్ని తిరిగి తీసుకుంటామని సుపీరియర్ చెబుతారు. దీంతో అతను సైక్రియాట్రిస్ట్ అయిన తండ్రి వద్దకు వస్తాడు.. అతను ఒకప్పటి హీరో అర్జున్..

అయితే సినిమాలో ఆర్మీని నేపథ్యంగా తీసుకున్నారు గానీ..యుద్ధ సన్నివేశాలు లేవు..కానీ సినిమా అంతా సీన్ బై సీన్ దేశం కోసం ఒక సైనికుడు తన కోపాన్ని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నమే కనిపిస్తుంది. ఒక దశలో అతని కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అతని తండ్రి 21 రోజులు గడువు పెడతాడు. ఆ టైమ్ లోనే కథనం నడుస్తుంది. అంతా అయ్యాక అతను కోపాన్ని గెలుస్తాడు.. కానీ క్యారెక్టర్ని కోల్పోతాడు.

ఈ సినిమాలో ప్రధానంగా ఒక మనిషి తన క్యారెక్టర్‌ని, ఇండివిడ్యువాలిటీని ఎలా కోల్పోతాడన్నది  చూపించారు. ఇది ఎవరికివారు ఎసెస్ చేసుకోవచ్చు.

బహుశా ఈ ఇంటర్నల్ క్యారెక్టర్.. జనానికి నచ్చకపోయి ఉండవచ్చు..

ఎందుకంటే పొద్దున్న లేస్తే అంతా రాజీ పడే బతుకులే కదా..ఎ క్కడో ఒక దగ్గర తల పెట్టి పనిచేయాల్సిందే..ఈ సొసైటీలో జరిగేదంతా క్యారెక్టర్‌ని చంపుకుంటూ బతకడమే. ఇంట్లో, ఆఫీసులో, బజారులో అన్నిచోట్లా సర్దుకుపోవాల్సిందే. బహుశా ఇదే మనవాళ్లకి నచ్చి ఉండదు. ఎందుకంటే మీకు నచ్చినట్టు చేయండి..అంటే అక్కడ హీరో కాబట్టి చేసేశాడు.

ఇక్కడలా చేస్తే? ఆఫీసులో  ముందు ఉద్యోగం పోతుంది. వ్యాపారంలో వ్యవహారం చక్కబెట్టుకోవడం రాకపోతే నష్టం వస్తుంది. నువ్వు చేస్తున్నది తప్పు అని ఎవరూ చెప్పకూడదు.. వేలెత్తి చూపంచకూడదు.. అందుకు మన తెలుగు ప్రేక్షకుడు అతీతుడు కాదు. మనవాళ్లకి అతిశయోక్తులు కావాలి.. ఓవర్ యాక్షన్ కావాలి. ఇవన్నీ పక్కన పెడితే అడుగడుగునా కనిపించే దేశభక్తి, డైలాగులు ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి.

‘ధోనీ’ సూపర్ హిట్.. అదే ‘సచిన్’.. అట్టర్ ప్లాఫ్

ఇంతకుముందు హిందీలో ఇండియన్ క్రికెటర్ ‘ధోనీ’పై తీసిన సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయ్యింది. అదే ’సచిన్‘పై తీసిన సినిమా.. అట్టర్ ప్లాఫ్ అయ్యింది. ధోనీ సినిమాలో అందమైన హీరో ఉన్నాడు. అంతకన్నా అందమైన హీరోయిన్ కీరా అడ్వాణీ ఉంది. మధ్యలో లవ్ ఎఫైర్ ఉంది. ఆ అమ్మాయి కూడా టాప్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. మంచి డైరెక్టరు ఉన్నాడు.

అదే సచిన్ సినిమాకి వస్తే అది అచ్చు ఇండియన్ డాక్యుమెంటరీలా ఉంది.  సచిన్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్, అతని ఫ్యామిలీ, పిల్లలు, అతను ఇండియన్ క్రికెట్ కి చేసిన మేలు, తీసుకువచ్చిన క్రేజ్, ఈరోజున  క్రికెట్ భారతదేశంలో ఇంత పాపులర్ కావడానికి 1983లో సాధించిన వరల్డ్ కప్ కారణమైతే..దానిని తర్వాత ఒక పీక్ కి తీసుకువెళ్లినవాడు, పాప్ లర్ చేసినవాడు ‘సచిన్’ మాత్రమేనని ఘంటాపథంగా చెప్పవచ్చు.

ఇంత రివ్యూ రాయడానికి కారణం..‘సచిన్’ సినిమా

ఆ రోజుల్లో సచిన్ ఒక్కడు ఆడితే ఇండియా గెలిచేది.. ప్రత్యర్థుల్లో ముఖ్యంగా పాకిస్తాన్ టీమ్ లో సచిన్ ని అవుట్ చేస్తే చాలు.. ఇండియాపై గెలుస్తాం అని అనుకునేవారు. ఎందుకంటే సచిన్ జట్టులో ఉంటే అవుటైపోకుండా ఉంటే.. అది జట్టుకి ఒక మానసిక బలం..అది ప్రత్యర్థుల గుండెల్లో బేజారు. 

సచిన్ అవుటైతే చాలు..100 కోట్ల మంది ప్రజలు చాలామంది టీవీలు కట్టేసి వెళ్లిపోయేవారు. మ్యాచ్ అయిపోయిందని అనుకునేవారు.  అది సచిన్ గొప్పతనం.. గంగూలీ కెప్టెన్సీలో వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ వరకు వెళ్లాం. సచిన్ ఒక్కడే అన్ని మ్యాచ్ లు బాగా ఆడి సెమీస్ వరకు తీసుకువచ్చాడు. అక్కడ ఒక్క మ్యాచ్  ఆడలేదు. అంతే అందరూ చాప చుట్టేశారు. ఇండియా కప్ గెలవలేదు కానీ.. సచిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఆ సిరీస్ లో ఒక్కడే 1000 పరుగులు పైనే సాధించాడు.

అలాగే విదేశాల్లో వరల్డ్ కప్ సిరీస్ జరుగుతోంది. అప్పుడే తండ్రి మరణించిన వార్త వచ్చింది. ఆ సిరీస్ మధ్యలో వచ్చి తండ్రి అంత్యక్రియల్లో పాల్లొని మళ్లీ క్రికెట్ ఆడటానికి వెళ్లిపోయాడు. అదీ దేశభక్తి అంటే.. ఆ మ్యాచ్ లోనే సెంచరీ చేసి..తండ్రికి అంకితం చేశాడు. అప్పుడే అతను క్రికెట్ బ్యాట్ ని ఆకాశంలో తండ్రికి చూపించాడు. అదే తర్వాత అందరికి అలవాటైపోయింది.

ఆరోజు సినిమా చూశాక నాకనిపించింది..మనవాళ్లు ఒక్కసారి సచిన్ పై అభిమానంతో సినిమా చూస్తే బాగుండేది..అని.. మళ్లీ ిఇప్పడనిపించింది. దేశంపై ప్రేమతో, సైనికులపై అభిమానంతో  ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ చూడాల్సింది అని..

కనీసం సచిన్ పై ఉన్నఅభిమానం, గౌరవం.. ఎన్నో విజయాలను అందించిన ఒక గొప్ప క్రికెటర్ జీవిత కథను చూసి ఉంటే..అతనెంతో సంతోషించే వాడు. నా దేశ ప్రజలు నన్ను గుర్తు పెట్టుకున్నారు..అని అతని మనసుకి చిన్న సంతోషమనే కానుక ఇచ్చిన వారిమయ్యేవారం.

సినిమా చూడనంత మాత్రాన మనలో అభిమానం తగ్గిపోతుందని అనలేం.. కానీ చిన్నపాటి  గౌరవాన్ని అందించే ఒక అరుదైన అవకాశాన్ని  మనం కోల్పోయామని మాత్రం చెప్పగలను.  ఇప్పుడదే  ‘ నా పేరు సూర్య. నా ఇల్లు ఇండియా’ లో కూడా జరిగింది.

అన్ని సినిమాలు.. ‘భరత్ అనే నేను’, ‘మహానటి’లాగే ఉండకపోవచ్చు…

ఇవీ ఇన్‌స్పిరేషన్ సినిమాలే.. అయితే తీసే విధానం గొప్పగా ఉండటంతో ఆదరించారు. వీటి మేకింగ్‌లో కూడా ఫెయిలైతే సావిత్రి సినిమా కూడా చూసేవారు కాదేమో. అన్ని సినిమాలు అలాగే ఉండాలనుకోవడం కరెక్టు కాదు. నా ఉద్దేశం సినిమా బాగుంటే చూడటం కాదు.. ఎలా ఉన్నా ‘సావిత్రి’ కోసమైనా సినిమా చూడాలి.. అనేట్టు ఉండాలి.

అదే మనం వారికిచ్చే నిజమైన గౌరవం. మన దేశం కోసం కృషి చేసిన లేదా దేశానికి పేరు తీసుకువచ్చిన వారికి సంబంధించిన సినిమాలు జయాపజయాలతో, ఫస్ట్ డే టాక్‌లతో సంబంధం లేకుండా చూసినప్పుడే.. నిజమైన సినిమా బతుకుతుంది.

-శ్రీనివాస్ మిర్తిపాటి

- Advertisement -