చిన్న వ్యాపారులకు పెద్ద ఊరట: జీఎస్టీ మినహాయింపు పరిమితి రెట్టింపు, ఎంతవరకంటే..?

arun jaitly comments on gst exception
- Advertisement -

arun jaitley

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చిన్న వ్యాపారులకు భారీ ఊరట కల్పించింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసింది. ప్రస్తుతం రూ.20 లక్షల వార్షిక టర్నోవర్ వరకు జీఎస్టీ నమోదు నుంచి మినహాయింపు ఉండగా, దీన్ని రూ.40 లక్షలకు పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో గురువారం ఇక్కడ జరిగిన జీఎస్టీ మండలి 32వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక వార్షిక టర్నోవర్ రూ.40 లక్షల వరకు జీఎస్టీ ఉండదు.

ఇది ఇలా ఉంటే, కొండ ప్రాంత ఈశాన్య రాష్ర్టాలకు ఈ పరిమితి ఇప్పుడు రూ.10 లక్షలుగా ఉంటే.. దాన్ని రూ.20 లక్షలకు పెంచారు. ఇక్కడ వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే జీఎస్టీ చెల్లింపులు జరుపాల్సిందే. ఇకపోతే జీఎస్టీ కంపోజిషన్ స్కీం కింద టర్నోవర్ ఆధారంగా చిన్న వర్తకులు, వ్యాపారులు చెల్లిస్తున్న 1 శాతం పన్ను రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్ దాటినవారికే వర్తిస్తుందని ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు.

ప్రస్తుతం ఈ పన్ను వార్షిక టర్నోవర్ కోటి రూపాయలు దాటితేనే ఉంది. ఏప్రిల్ 1 నుంచి మార్పు వర్తిస్తుందని జైట్లీ తెలిపారు. రూ.50 లక్షలదాకా వార్షిక టర్నోవర్ ఉన్న సేవలు లేదా, వస్తు, సేవల కల్పనదారులు, సరఫరాదారులూ కంపోజిషన్ స్కీంను ఉపయోగించుకోవడానికి అర్హులని చెప్పారు. కంపోజిషన్ స్కీం కింద సేవల కోసం పన్ను రేటు 6 శాతంగా ఉంటుందని వెల్లడించారు. ఈ నిర్ణయాలు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు దన్నుగా ఉండగలదని చెప్పారు.

8వేల కోట్ల ఆదాయం..

ఈ క్రమంలో మండలి తాజా నిర్ణయాలు సరళతర జీఎస్టీ, ప్రజాహిత జీఎస్టీకి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. కాగా, జీఎస్టీ మండలి తీసుకున్న తాజా నిర్ణయాలు చిన్న వ్యాపారులకు గొప్ప ప్రయోజనాల్ని కలిగించేలా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎంఎస్ఎంఈలకు తాజా నిర్ణయాలు గొప్ప ఊరటను ఇవ్వగలవని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. పన్ను భారం తగ్గడం వల్ల వ్యాపారాభివ్రుద్ధికి ఆస్కారం ఉంటుందని అన్నారు. అసోచామ్, కేపీఎంజీ ఇండియా, డెలాయిట్ ఇండియా, ఈవై ఇండియాలు తాజా నిర్ణయాన్ని స్వాగతించాయి. కాగా, జీఎస్టీ మండలి తీసుకున్న తాజా నిర్ణయాల కారణంగా కేంద్ర ఖజానాకు రూ. 8,200కోట్ల ఆదాయం దూరం కానుంది.

రాష్ట్రాల ఇష్టం

టర్నోవర్‌ పరిమితిని పెంచడం కారణంగా రాష్ట్రాలు రూ.5,200 కోట్ల ఆదాయాన్ని కోల్పోవలసి ఉంటుంది. అందువల్ల పరిమితిని పెంచాలా, వద్దా అన్న నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకు విడిచిపెట్టారు. టోర్నోవర్‌ పరిమితి పెంపు వల్ల పన్ను చెల్లించే వారి సంఖ్య తగ్గుతుందని, అందువల్ల ఆదాయాన్ని కోల్పోతామని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏ విషయాన్ని ఆయా రాష్ట్రాలు వారం రోజుల్లోగా జీఎస్‌టీ మండలి సెక్రటేరియట్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. పుదుచ్చేరి ఈ ప్రతిపాదన చేసిందని అరుణ్ జైట్లీ తెలిపారు.

ఇది ఇలా ఉంటే.. ఒక రాష్ట్రం పరిధిలో జరిగే వ్యాపారానికే టర్నోవర్‌ పరిమితి పెంపు నిబంధన వర్తిస్తుందని, అంతర్రాష్ట్ర వ్యాపారం చేసే వారికి వర్తించబోదని రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. ప్రస్తుతం రూ.20 లక్షల టర్నోవర్‌ కన్నా తక్కువ ఉన్నప్పటికీ 10.93 లక్షల మంది జీఎస్టీ చెల్లిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు వారందరికీ ఊరట కలగనుంది.

కేరళకు ప్రత్యేక వెసులుబాటు

ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళకు అదనంగా నిధులు సమీకరించుకోవడానికి జీఎస్‌టీ మండలి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. అంతర్రాష్ట్ర వ్యాపారంపై 1 శాతం వైపరీత్యాల సెస్సు విధించుకునే అవకాశం ఇచ్చింది. రెండేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది.

- Advertisement -

1 COMMENT

  1. ఇదొక మంచి నిర్ణయం. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయమే అయినా దీని వల్ల ఎంతోమంది చిన్న వ్యాపారులకు మేలు కలుగుతుంది.