నాడు దారిచూపిన దేవత.. నేడు ‘గూగుల్ మాత’

- Advertisement -

 

king-on-mat

మన భారతదేశం కథలకు పుట్టిల్లు.. చందమామ, బొమ్మరిల్లులో చదివిన ఇంకా అమ్మమ్మ, తాతయ్య చెప్పే, కథలెన్నో..  అందులో  ఒక కథ ఇది..

కాకులు దూరని కారడవుల్లో, చీమలు దూరని చిట్టడవుల్లో  ఒక రాకుమారుడు..ఒంటరిగా రాకుమార్తెను వెతుక్కుంటూ వెళుతుంటాడు.. అలా వెళుతూ..వెళుతూ ఉండగా..ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు. అతనిని సలహా అడుగుదామని వెళతాడు. కానీ అతను కళ్లు తెరవడు. ఆ రాకుమారుడు చేసేది లేక అక్కడే  ఆ స్వామీజీకి సేవలు చేస్తూ గడుపుతుంటాడు. కొన్నిరోజులకి మునీశ్వరుడు కళ్లు తెరచి రాకుమారుడిని చూసి.. అతని సపర్యలకు సంతసించి..తన దివ్యదృష్టితో అంతా తెలుసుకొని  ఒక మంత్రం జపించమని ఉపదేశిస్తాడు.

రాకుమారుడు  ఎంతో సంతసించి.. కొంచెం దూరం వెళ్లి  ఆ మంత్రాన్ని జపిస్తాడు. అప్పుడు ఒక

 

దేవతా మూర్తి (ఒక విశ్వమాత) ప్రత్యక్షమవుతుంది.

‘నరుడా ఏమి నీ కోరికా’ అని అడుగుతుంది..

అప్పుడు రాకుమారుడు  ఆమెను రాకుమారి ఉన్న ప్రాంతాన్ని అడుగుతాడు. అందుకామె  ఒక చాప, ఒక మర చెంబు, లాంటివిచ్చి.. వీటి సాయంతో నీ రాకుమారిని కనుక్కోగలవని అదృశ్యమవుతుంది.  అలా రాకుమారుడు చాపపై ఎక్కి ఆకాశమార్గాన వెళతాడు.. అలా సప్త సముద్రాలు దాటి..ఒక కీకారణ్యంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ మర్రిచెట్టుతొర్రలో మాంత్రికుడి ప్రాణం  ఒక చిలుకలో దాగి ఉంటుంది. అక్కడకు వెళుతుండగా దారిలో ఒంటికన్ను రాక్షసుడితో యుద్ధం మొదలవుతుంది. అలా అష్టకష్టాలు పడి..చివరికి  రాకుమారిని చేరుకుంటాడు.

శిలగా మారిపోయిన రాకుమారిని చూసి విలపిస్తాడు. అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది. నీకు దారిలో ఆ విశ్వమాత  ఇచ్చిన మరచెంబు ఉంది కదా..అందులో మంత్ర జలం ఉంది..అది       ఆ రాతి విగ్రహంపై జల్లితే..నీ రాకుమారి తిరిగి నీదవుతుంది..అని వినిపిస్తుంది.. అంతే రాకుమారుడు తఠాలున అక్కడకు చేరి ఆ మరచెంబులో నీళ్లు తెచ్చి ఆ రాతి విగ్రహంపై  గబగబా జల్లుతాడు..అంతే రాకుమారి చెంగుమని దూకి..రాకుమారుడిని చేరుకుంటుంది. కాసేపు ఉద్విగ్న భరిత క్షణాల తర్వాత..ఇద్దరూ  ఆ చాపపై ఎక్కి తిరిగి రాజ్యం చేరుకుంటారు.

హమ్మయ్యా ఇదండీ కథ.. ఇదంతా ఎందుకంటే.. ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం.. ఆ కథలు లేవు..ఆ  మాంత్రికుడు లేడు..ఆ మాయలు లేవు..అలా సహాయపడే వారు లేరు.. కానీ మనకు   ఒక సమస్య వచ్చింది. లేదా కొత్త అవసరం వచ్చింది. లేదా నలుగురు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి..అనుకుంటున్నాం.. అయితే అప్పటిలా ఆ మునీశ్వరుడి దగ్గర సపర్యలు చేయాల్సిన అవసరం లేదు..కానీ  ఇంటర్నెట్‌లో మనం ఒకరి దగ్గర వెతకాలి.

google-serchఆమె ఎవరంటే.. ‘గూగుల్ మాత’..

ఇప్పుడు సెర్చింజ‌న్ దిగ్గ‌జం  గూగుల్ మాత వివరాలు మీకోసం..

వంద‌ల కోట్ల సంఖ్య‌లో వినియోగ‌దారులు ఉన్న గూగుల్ సాఫ్ట్ వేర్ దిగ్గజం
లెక్కకు అందని ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ట‌ర్నోవ‌ర్‌… క్షణక్షణానికి కోటానుకోట్ల సెర్చ్ పేజీలు.. లెక్క‌కు మించిన అప్లికేష‌న్లు.. ఒకరకంగా చెప్పాలంటే..ఈ ప్రపంచమే ఇప్పుడు గూగుల్ పై ఆధారపడి ఉందని చెప్పాలి.  అలాంటి గూగుల్ 1998లో ప్రారంభమైంది.

చాలా డేట్లు ఉన్నాయి. నిర్ధిష్టంగా ఈ తేదీపై వివరాలు రకరకాలుగా ఉన్నాయి. మొదట వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని  సెప్టెంబ‌ర్ 7,  తర్వాత  8,  ఆ తర్వాత 26 తేదీల్లో  చేసేవారు.

అసలు ఏరోజు కరెక్ట్ అని గూగుల్ వికీ పేజ్‌లో చూస్తే  సెప్టెంబ‌ర్ 4, 1998 అని ఉంది. ఇవన్నీ కాదు..చివరికి 2006 నుంచి సెప్టెంబ‌ర్ 27న గూగుల్ బ‌ర్త్ డేను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.

అసలు గూగుల్ పేరెలా వ‌చ్చిందంటే..

గూగుల్‌ అనే పదం గూగోల్‌ అనే పదం నుంచి వచ్చింది. అంటే ఒకటి పక్కన వంద సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అది. కాలిఫోర్నియాలో   గూగుల్‌ ప్రధాన కార్యాలయం ఉంది.

మే 9, 2000న 10 భాషలతో సెర్చింజన్ గూగుల్ రిలీజ్

ఇప్పుడు దాదాపు 150 పైచిలుకు భాష‌ల్లో గూగుల్  నుంచి వివరాలు లభ్యమవుతున్నాయి. జూన్ 2000 గూగుల్ ప్ర‌పంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్‌లాగా అవ‌త‌రించింది.                       డిసెంబ‌ర్ 2000 గూగుల్ టూల్ బార్ ప్ర‌వేశ‌పెట్టడం విశేషం.

జూలై 2001 చిత్రాలు విడుదల

2001, జులై న గూగుల్ చిత్రాలు విడుదల చేసింది. ఇప్పుడు దాదాపు 250 మిలియన్ల  చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇదే అతి పెద్ద ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ వెబ్ గా ప్రపంచంలో గుర్తింపు పొందింది.  2001 గూగుల్ మొదటి వార్షికొత్సవం జరిగింది. సంవత్సరంలో లక్షల మంది ప్రజలు గూగుల్ లో  ఏమేమి చూశారనేదానిపై కూడా ఒక చర్చ జరిగింది.

జూన్ 2013 లూన్ ప్రాజెక్టుని గూగుల్ చేప‌ట్టింది. అలాగే జులై 2013న మొబైల్ వినియోగ‌దారుల కోసం గూగుల్ మ్యాప్‌ను రిలీజ్ చేసింది. జూలై 2014 గూగుల్ మ్యాప్‌ను హిందీలో ప్రారంభించారు. తర్వాత  2014న ఆండ్రాయిడ్ వన్ ఇండియాలో ఆపరేటింగ్ సిస్టం ఇండియాలో ప్రారంభమైంది. అక్టోబర్ 14న గూగుల్ వాయిస్‌ను ఇండియాలోకి తీసుకొచ్చింది.  ఇప్పుడు గూగుల్ మాత చేతిలో ఎన్నో వరాల మూటలు.. మీరు ఏదైనా అడగండి. మీరు సమాచారం రూపంలో ఏదైనా సంధించండి..రాకుమారుడిలా అంత కష్టపడక్కర్లేదు..

ఒక్క క్లిక్ చాలు.. మీ కోటి సమస్యలను చిటికెలో పరిష్కరించేస్తుంది.. ఖచ్చితమైన దారి చూపిస్తుంది. మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. అయితే అన్నింటిలో లోపాలున్నట్టే గూగుల్ లో కూడా ఉన్నాయి.. కొందరు దీనిని దుర్వినియోగం చేస్తు్న్నారు.. కొందరు తప్పుడు సమాచారం పెట్టి అందరికి పంపిస్తున్నారు. కొందరు అదే నిజమనుకొని అందరికీ పంపేస్తున్నారు. కొందరు ప్రత్యర్థులపై కక్ష కోసం వాడుకుంటున్నారు. కొందరు అభిమానం కోసం వాడుకుంటున్నారు. కొందరు మిత్రుల మరిచిపోయిన పుట్టినరోజులని గుర్తు చేస్తున్నారు. కొందరు చిన్ననాడు తప్పిపోయిన మిత్రులను వెతికి పట్టుకుంటోంది.. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు..గూగుల్ మాత పుణ్యమే.. ఇలా  ఎంత చెప్పినా..తక్కువే..

అయితే సెప్టంబరు 4 గూగుల్ మాత పుట్టినరోజు..ఇన్ని రోజులకి ఆరోజున యాజమాన్యం గుర్తించింది.

- Advertisement -