వైఎస్ జగన్‌పై దాడి కేసులో.. నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్!

- Advertisement -

రాజమండ్రి: వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. 2018 అక్టోబర్ చివర్లో విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

చదవండి: వైసీపీని ఈ స్థాయిలో గెలిపించడం.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమా!?

అయితే బెయిల్‌పై విడుదలైన సందర్భంగా నిందితుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. తాను వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేయలేదని స్పష్టం చేశాడు. ‘‘నేను ఎయిర్‌పోర్ట్‌లో ఒక కుక్‌గా పనిచేస్తున్నా. జగనన్న కచ్చితంగా సీఎం అవుతాడని నాకు తెలుసు. అందుకే ప్రజా సమస్యల గురించి జగనన్నకు చెప్పడానికి ఒక లెటర్ తీసుకుని వెళ్లాను..’’ అని చెప్పాడు.

‘‘నేను హత్యాయత్నం చేయలేదు..’’

‘‘అయితే జగనన్న ఎక్కడ మిస్సయిపోతాడోనన్న కంగారులో నా చేతిలో పళ్లు కోసే కత్తిని చూసుకోకుండా అలాగే ఆయన దగ్గరికి వెళ్లిపోయాను. ఆ కంగారులో అనుకోకుండా ఆ కత్తి జగనన్న భుజానికి తగిలింది. ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అనుకుంటే నార్కో టెస్ట్‌కు కూడా నేను సిద్ధం. కాకపోతే అప్పటి ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేసింది..’’ అని శ్రీనివాస్ వివరించాడు.

చదవండి: అంతేగా.. అంతేగా!: కవిత ఎమ్మెల్సీ అయి.. మంత్రిగా కూడా రావొచ్చట!

అంతేకాదు, తాను ఇప్పటివరకు ప్రాణాలతో ఉన్నానంటే అందుకు జగనన్నే కారణమని, ఆరోజు తనపై అందరూ దాడి చేస్తుంటే జగనన్నే అడ్డుకున్నాడని, ఆయన దైవగుణం కలిగిన వ్యక్తి అని శ్రీనివాస్ విలేకరులకు చెప్పాడు.

అయితే రాబోయే ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామని అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసునని, అందుకే సానుభూతి కోసం.. కావాలనే జగన్ తనపై దాడి చేయించుకున్నాడని ప్రచారం చేశారని, నేనే గనుక జగనన్నపై హత్యాయత్నం చేశానని తేలితే నా తల తీయించుకుంటానని శ్రీనివాస్ మీడియా ముందు ఎంతో ఉద్వేగంతో మాట్లాడాడు.

అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయభేరి మోగించిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్న సమయంలో.. ఇన్నాళ్లూ జైలులో ఉన్న శ్రీనివాసరావుకు బెయిల్‌పై విడుదల కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

చదవండి: జగన్‌ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

- Advertisement -