స్నానం చేయడు.. గడ్డం గీయడు.. కాపురమెలా? విడాకుల కోసం కోర్టుకెక్కి భార్య!

6:41 pm, Sat, 13 April 19
woman-filed-for-divorce-on-husband

భోపాల్: ఆధునిక ప్రపంచంలో మనుషుల మధ్య బంధాలకు విలువే లేకుండా పోతోంది. ఒకప్పుడు భార్యభర్తల్లో ఎవరైనా విడాకులకు దరఖాస్తు చేసుకోవాలంటే అందుకు బలమైన కారణాలు చూపించాల్సి వచ్చేంది. కానీ ఇప్పుడలా కాదు… చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు.. విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

విషయం ఏమిటంటే… మధ్యప్రదేశ్‌లో ఓ జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. కారణమేంటో తెలుసా? తన భర్త (25) కొన్ని రోజుల పాటు స్నానం చేయకుండా, గడ్డం గీసుకోకుండా ఉంటున్నాడని, అతడితో తాను కాపురం చేయలేనని, తనకు విడాకులు ఇప్పంచాలనేది ఆ భార్య(23) అభ్యర్థన.

ఆమె పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన భోపాల్‌ ప్యామిలీ కోర్టు జడ్జి ఆర్ఎన్ చాంద్.. వారిద్దరినీ ఆరు నెలల పాటు విడిగా ఉండాలని, అప్పుడే విడాకులు ఇవ్వగలమని స్పష్టం చేశారు. వీరిని కౌన్సెల్‌ చేసిన షెయిల్ అవస్థి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

భోపాల్‌లోని బరిగఢ్‌కు చెందిన ఓ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. వీరిది కులాంతర వివాహం. భర్త సింధీ, భార్య బ్రాహ్మిణ్. అయితే వీరి వివాహం పెద్దల అనుమతితోనే జరిగింది. పెళ్లయి కూడా ఏడాదే అయింది. తీరా పెళ్లి చేసుకున్నాక కాని ఒకరి అలవాట్లు ఒకరికి అర్థం కాలేదు.

తన భర్త వరుసగా ఏడెనిమిది రోజులపాటు స్నానం చేయడని భార్య తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అతడి నుంచి దుర్గంధం వస్తోందని, స్నానం చేయమని చెబితే పెర్‌ఫ్యూమ్‌ చల్లుకుంటాడని, అతడి ప్రవర్తనతో తాను విసిగి పోయానని, తనకు విడాకులు ఇప్పించాలని అభ్యర్థించింది.

దీనికి ఆమె భర్త కూడా సమ్మతించడంతో ఇద్దరూ కలిసి కోర్టును ఆశ్రయించారు. మొత్తానికి మరో ఆర్నెల్లలో వారికి విడాకులు మంజూరు కానున్నాయి. దీంతో మురికి మొగుడితో సంసారం చేయాల్సిన బాధ తప్పిందంటూ ఆ భార్య ఆనందపడిపోతోంది.

అంతేలెండి.. మొక్కజొన్న పొత్తు తెమ్మంటూ చల్లారిన పొత్తు తెచ్చాడనో, ప్రయాణంలో మంచినీళ్లు కావాలని అడిగితే కనీసం ఓ వాటర్ బాటిల్ కూడా కొనివ్వలేదనో, అరె.. పానీ పూరీ తినిపించని మొగుడు కూడా ఒక మొగుడేనా? ఇలాంటి కారణాలకే విడాకులు తీసుకుంటున్న నేటి రోజుల్లో కట్టుకున్న మొగుడు రోజుల తరబడి స్నానం చేయకుండా ఉంటే ఏ భార్య భరిస్తుంది మరి!