ముఖ్యమంత్రే తప్పుదోవ పట్టిస్తే ఎలా?: వివేకా హత్యపై ఈసీకి సునీతారెడ్డి ఫిర్యాదు

- Advertisement -

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేదిని గురువారం కలిశారు. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని వారు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే విచారణను తప్పుదారిపట్టించే విధంగా వాఖ్యానించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తోన్న వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని వారు వివరించారు. వివేకా హత్య కేసును నిష్పాక్షికంగా విచారించి అసలు దోషులకు శిక్షపడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

దర్యాప్తుపై ప్రభావం చూపేలా సీఎం వ్యాఖ్యలు..

తన తండ్రి హత్యపై పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్‌ క్లిప్పింగ్‌లను ద్వివేదికి సమర్పించారు. అనంతరం సునీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సిట్‌’పై ప్రభావం చూపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.

‘దర్యాప్తు సంస్థపై సీఎం ఒత్తిడి ఉంటే కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. దర్యాప్తు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని, నిన్న మీడియాతో తాను ఏం మాట్లాడానో అవే విషయాలు ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకు వెళ్లాను. ఈ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇస్తామని సీఈవో తెలిపారు.’ అని సునీతారెడ్డి వెల్లడించారు.

 

- Advertisement -