పెంపుడు చిలుకపై కేసు పెట్టి లోపలేసిన పోలీసులు! ఎందుకంటే…

- Advertisement -

బ్రెజిల్: పెంపుడు చిలుకలు మాట్లాడతాయని అందరికీ తెలుసు. ముద్దుముద్దుగా అవి పలికే మాటలకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇప్పుడు చెప్పబోయే చిలుక కూడా అలాంటిదే. స్మగ్లర్లు పెంచుకుంటున్న ఈ చిలుక వారి మాటలు, గుట్టుమట్లన్నీ తెలుసుకుంది. దీంతో వారికి అది తెగ నచ్చేసింది.

స్మగ్లర్ల కోసం ఎవరైనా వస్తే హెచ్చరించి వారిని అప్రమత్తం చేసేది. తాజాగా మరోమారు అలాంటి ప్రయత్నమే చేసి చిక్కుల్లో పడింది. ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటోంది. బ్రెజిల్‌లోని పియాయి రాష్ట్రంలోని విలా ఇర్మా డల్సీలో జరిగిందీ ఘటన.

బ్రెజిల్ అంటేనే స్మగ్లర్లకు స్వర్గధామం. అక్కడ నిత్యం పోలీసులు స్మగ్లర్ల కోసం వేటాడుతూనే ఉంటారు. తాజాగా ఓ స్మగ్లింగ్ ముఠా పెద్ద ఎత్తున నిషేధిత మాదకద్రవ్యమైన కొకైన్‌ను భద్రపరిచినట్టు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందినదే తడవుగా పోలీసులు స్మగ్లర్ల డెన్‌పై దాడి చేయాలని నిర్ణయించారు. పెద్దఎత్తున డెన్ వద్దకు చేరుకుని చుట్టుముట్టారు.

పోలీసులు డెన్‌ను చుట్టుముట్టిన విషయం లోపలున్న స్మగ్లర్లకు తెలియదు. దీంతో తాము వచ్చిన పని పూర్తయినట్టేనని పోలీసులు భావించారు. అయితే, సరిగ్గా అప్పుడే పోలీసులకు షాకిచ్చిందో చిలుక. డెన్ బయట పంజరంలో ఉన్న చిలుక పోలీసుల రహస్య ఆపరేషన్ మొత్తాన్ని నాశనం చేసింది.

పోలీసులు డెన్‌ను చుట్టుముట్టడాన్ని చూసిన చిలుక వెంటనే అప్రమత్తమైంది. ‘‘మమ్మా ది పోలిస్’’ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అంతే.. దాని అరుపులకు అలెర్ట్ అయిన లోపలున్న స్మగ్లర్లు నెమ్మదిగా కిటీకీ తెరిచి చూశారు. బయట పోలీసులు చుట్టుముట్టిన విషయం గ్రహించి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పరారయ్యారు.

ఒక్క చిలుకతో.. పోలీసుల ప్లాన్ మొత్తం నాశనం!

తీరా పోలీసులు డెన్ లోపలికి వెళ్లి చూస్తే ఏముంది? ఒక్కరు కూడా లేరు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు ఇదంతా చిలుక పనేనని భావించి తీసుకెళ్లి దాన్ని లోపలేశారు.  చిలుక మీద కేసు పెట్టిన పోలీసులు స్మగ్లర్లు పారిపోయేలా వారిని అప్రమత్తం చేసింది ఇదేనని వాదించారు.

అయితే, ‘‘మమ్మా ది పోలిస్’ అని గట్టిగా అరిచిన చిలక.. పోలీసుల వద్ద మాత్రం కిక్కురుమనలేదట. దీంతో పోలీసులు చిలుకపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పర్యావరణ ప్రేమికులు విరుచుకుపడ్డారు. చిలుకను వదిలిపెట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆందోళన చేపట్టారు. దీంతో తలలు పట్టుకోవడం పోలీసుల వంతైంది.

పక్షుల మీద, జంతువుల మీద కేసులు పెట్టడం ఇదేమీ తొలిసారి కాదు. 2010లో కొలంబియాలోనూ ఇలాగే జరిగింది. స్మగ్లర్ల ఇంటిపై పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడే ఉన్న చిలుక ‘రన్ రన్’ అంటూ వారిని అప్రమత్తం చేసింది. ఇక, మన దేశంలోనూ కోళ్లు, ఆవు దూడలను పోలీసులు లోపలేసిన సందర్భాలు ఉన్నాయి.

- Advertisement -