స్వర్గం అన్నాడు.. అమెరికా తీసుకెళ్లి నరకాన్ని చూపించాడు!

NRI woman
- Advertisement -

NRI woman

హైదరాబాద్: మూడుముళ్ల బంధంతో ఏర్పడిన కొత్త బంధంపై ఎన్నో కలలతో.. అమెరికా అనగానే స్వర్గం అనుకుంటూ భర్తతో  కలిసి జీవించడానికి ఖండాంతరాలు దాటి అమెరికా వెళ్ళిన ఆమెకు  కట్టుకున్న భర్తే నరకాన్ని చూపించాడు. దేశంకాని దేశంలో అండగా నిలబడాల్సిన భర్త అక్కడి పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకొని వేధింపులకు దిగాడు. అవి భరించలేక  అమెరికా నుంచి ఆమె భారత్‌కు తిరిగి వచ్చేసింది. వచ్చిన కొద్ది రోజులలోనే పుట్టింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ సంఘటన హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్‌స్సెక్టర్ సర్సింహస్వామి వివరాల ప్రకారం.. నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని కాకతీయనగర్‌కు చెందిన గంగాదేవి, మల్దారి దంపతుల కుమార్తె మాధురి (27)కి 2016 నవంబర్‌లో నేరేడ్‌మెట్ ప్రాంతానికే చెందిన కోటేశ్వరరావుతో వివాహం జరిగింది.

స్నేహితులతో డాన్స్ చేయాలని…

పెళ్ళి తరువాత భార్యభర్తలిద్దరూ అమెరికాకు వెళ్లారు. భర్త ఆమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కోటేశ్వరరావు..  పార్టీల్లో పాల్గొనాలని, మద్యం తాగాలని భార్య మాధురిని ఒత్తిడి చేసేవాడు.  అంతేకాదు, పేకాట ఆడటం.. తన స్నేహితులను ఇంటికి పిలిచి… వారితో డాన్స్ చేయాలని భార్యను బలవంతం పెడుతూ వేధింపులకు గురి చేసేవాడు. భర్త చేష్టలతో విసుగు చెందిన మాధురి ఈ విషయాలను హైదరాబాద్‌లోని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. కోటేశ్వరరావు వేధింపులను ఆమె తల్లిదండ్రులు కూడా అల్లుడి తరుపు  పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ నెల 11న ఆమెరికా నుండి భారత్‌కు వచ్చిన మాధురి అప్పటి నుండి  పుట్టింటిలోనేే  ఉండిపోయింది. ఈ క్రమంలో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నితో ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది.  తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, మాధురి మృతదేహన్ని శవ పంచనామ నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, కోటేశ్వరరావును ఎలాగైనా అమెరికా నుంచి రప్పించి అరెస్టు చేస్తామని సీఐ సర్సింహస్వామి తెలిపారు.

- Advertisement -