వరంగల్‌లో మరో ఘోరం.. తొమ్మిదో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం

7:39 am, Mon, 12 August 19

వరంగల్: తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటనను మర్చిపోకముందే వరంగల్‌లో మరో ఘోరం జరిగింది. నానమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్న 15 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అవమానం భరించలేని ఆ చిన్నారి ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌లోని సమ్మయ్య నగర్‌కు చెందిన బాలిక తల్లిదండ్రులను కోల్పోయి ప్రస్తుతం నానమ్మ వద్ద ఉంటోంది. స్థానికంగా ఉన్న పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన తిరుపతి, ప్రసన్నకుమార్‌ అనే యువకులతో బాలికకు పరిచయం ఉంది.

శనివారం బాలిక ఇంటికి వచ్చిన యువకులు ఆమెను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి పెంబర్తి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. వీరితోపాటు మరో బాలుడు కూడా ఆమెపై అఘాయిత్యం చేశాడు. అనంతరం ముగ్గురూ పరారయ్యారు.

అక్కడి నుంచి బయటపడిన బాలిక ఇంటికొచ్చి జరిగిన విషయాన్ని నానమ్మకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. జరిగిన ఘటనను పదేపదే తలచుకుని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆదివారం ఉదయం ఫ్యాన్‌క ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు తిరుపతి, ప్రసన్నకుమార్‌ల కోసం గాలిస్తున్నారు.