నాగార్జున సాగర్‌కు ఉప్పెనలా పర్యాటకులు.. ట్రాఫిక్ ఆంక్షలు

11:14 am, Sun, 18 August 19

నల్గొండ: వరదలతో ఉప్పొంగుతున్న కృష్ణమ్మ అందాలను తనివితీరా తిలకించేందుకు నాగార్జున సాగర్‌కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఆదివారం కూడా రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ నుంచి మాచర్ల, గుంటూరు వెళ్లే వాహనాలను పెద్దవూర, హాలియా, మిర్యాలగూడ మీదుగా మళ్లించారు. గుంటూరు, మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను పిడుగురాళ్ల అద్దంకి-నార్కెట్ పల్లి హైవే మీదుగా మళ్లించినట్టు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు. అంతేకాదు, నేడు సాగర్ మీదుగా ప్రయాణించేవారు వీలైతే తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు.

పర్యాటకుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశామని, రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేస్తే రూ.1000 వసూలు చేస్తామని హెచ్చరించారు. సాగర్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం పెద్ద మొత్తంలో పోలీసులను రంగంలోకి దింపారు.