నేటి నుంచే ‘బతుకమ్మ’.. తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది రోజులు పూల జాతరే!

bathukamma-sindhu
- Advertisement -

bathukamma-celebrations

హైదరాబాద్: తెలంగాణ పండుగల్లోనే ప్రత్యేకమైన, శీతాకాలం ఆరంభంలో వచ్చే పూలపండుగ ‘బతుకమ్మ’ మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే ఈ వేడుకలు తొమ్మిది రోజులపాటు కొనసాగుతాయి. బతుకమ్మ సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ఆపద్ధర్మ ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.

మంగళవారం నుంచి 17వ తేదీ వరకు జరిగే వేడుకల ప్రారంభ కార్యక్రమాన్ని హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి.

ఒక్కో రోజు.. ఒక్కో పేరుతో…

గుమ్మడి, తంగేడు, గునుగు, రుద్రాక్ష, బీర, బంతి, కట్టపూలు, గన్నేరు, అడవిమల్లె, సీతమ్మ జడపూలు.. ఇలా రకరకాల పూలతో బతుకమ్మను ముస్తాబు చేస్తారు. బతుకమ్మకు ఒక్కోరోజు పెట్టే నైవేద్యాన్ని బట్టి ఒక్కోపేరుతో పిలుస్తారు.

ముంబై, బెంగళూరు, సూరత్, భీవండి పట్టణాలతోపాటు అమెరికా, లండన్, యూరప్, ఆస్ట్రేలియా, మలేషియా, డెన్మార్క్, సింగపూర్ తదితర దేశాల్లోనూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. అంతేకాదు, రవీంద్రభారతి సహా ఇతర ప్రాంతాల్లో నిర్వహించే ఈ బతుకమ్మ వేడుకల్లో రష్యా, అజర్‌బైజాన్, కజికిస్థాన్ తదితర 21 దేశాలకు చెందిన మహిళా కళాకారులు పాల్గొననున్నారు.

హైదరాబాద్‌లో ఇలా…

హైదరాబాద్‌లోని బైసన్‌పోలో గ్రౌండ్స్, పరేడ్‌గ్రౌండ్స్, పీపుల్స్‌ప్లాజా, తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లలో ప్రత్యేక సంబురాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరిగే పారామోటరింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

9 నుంచి 16 వరకు రవీంద్రభారతి వేదికగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి వేదికగా బతుకమ్మ ఆట-పాట, కోలాటం ప్రదర్శిస్తారు. 12, 13 తేదీల్లో డిజిటల్ తెలంగాణ మీద సదస్సులు జరుగనున్నాయి. 9వ తేదీ నుంచి ఆక్టోబర్ 16 వరకు ప్రతిరోజు బతుకమ్మ ఫిల్మోత్సవం, 30 మందితో ఐదు రోజులపాటు ప్రత్యేక ఆర్ట్ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు.

15న హైటెక్స్‌లో దివ్యాంగులతో స్పెషల్ బతుకమ్మ, 7, 8, 9 తేదీల్లో శిల్పారామంలో జపాన్ స్టెల్‌లో పుష్పాల ప్రదర్శన, మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 55 మంది కళాకారులు పాల్గొనే ప్రత్యేక వేడుకలు, రాజధాని, శతాబ్ది రైళ్లలో బతుకమ్మ బుక్‌లెట్ల పంపిణీ, 13న 300 మంది ఆలిండియా సివిల్ సర్వీస్ ట్రైనీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు.

ట్యాంక్‌ బండ్‌పై లేజర్‌ షో…

17న సద్దుల బతుకమ్మ వేడుకలో భాగంగా ట్యాంక్‌ బండ్‌పై లేజర్‌షో, పటాకులు కాల్చడం, 1000 మంది జానపద కళాకారుల ప్రదర్శనతోపాటు సామూహికంగా బతుకమ్మ నిమజ్జనానికి అధికారులు అవసరమైనఏర్పాట్లు చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో…

బతుకమ్మ పండగను వైభవంగా నిర్వహించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని మానేరు నది ఒడ్డున రూ.1.60 కోట్లతో ప్రత్యేకంగా నిర్మిస్తున్న బతుకమ్మ ఘాట్ సద్దుల బతుకమ్మ నాటికి అందుబాటులోకి రానుంది. ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో 40 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఈ ఘాట్‌ను అతిసుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

ఘాట్‌కు ఇరువైపులా నందనవనం, పిల్లలు ఆటవస్తువులు, మహిళలు పెద్దఎత్తున బతుకమ్మ ఆడుకునేలా విశాలమైన ప్రాంగాణాన్ని నిర్మిస్తున్నారు.  ఘాట్ మధ్యలో తల్లీబిడ్డల పాలరాతి విగ్రహాలను, బతుకమ్మల నిమజ్జనాన్ని వీక్షించేందుకు విశాలమైన ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తున్నారు. పక్కనే స్థలాన్ని రోజూ వెయ్యి మంది సద్దుల బతుకమ్మ ఆడుకునేలా చదును చేస్తున్నారు.

ఘాట్ చుట్టూ రంగురంగుల పూలమొక్కలు, పచ్చగడ్డి పరిచి పార్కులా తీర్చి దిద్దుతున్నారు. ప్రధాన రహదారి నుంచి మానేరు వరకు సీసీరోడ్డు నిర్మిస్తున్నారు. బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషాతో కలిసి సోమవారం సందర్శించారు.

- Advertisement -