లక్ష్మణుడు లేని రామాలయం! దేశంలో మరెక్కడా లేదు.. ఇవీ ఆలయ విశేషాలు…

Nizamabad-Srirama-Temple-2

హైదరాబాద్: రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఈ దేశంలో ఎక్కడ ఏ రామాలయంలో చూసిన ఈ నలుగురు ఉండడమే రామాలయ ప్రత్యేకత, ఇక రామాయణంలోని ఘట్టాన్ని పరిశీలిస్తే జననం మొదలుకుని పట్టాభిషేకం వరకు లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండలేదన్నది చరిత్ర చెప్తోంది, అదే ఇంత కాలం మనందరికీ తెలుసు.

కానీ నిజామాబాద్ జిల్లాలో లక్ష్మణుడు లేకుండానే సీతా సమేతంగా శ్రీరాముడికి ఆలయం ఉంది. ఇక్కడ‌ లక్ష్మణుడు లేకుండానే శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుండటం విశేషం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

మూడు మూర్తులుగా వెలసిన బుజ్జా గంబుల మూలమూర్తికి పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలతో కన్నుల పండువగా స్వామి వారికి కల్యాణం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలో ఈ రామాలయం ఉంది. ఎల్లప్పుడు రాముడికి తోడు నీడగా ఉండే లక్ష్మణుడు ఈ ఆలయంలో కనిపించడు. హనుమంతుడు, సీత సమేతంగా శ్రీరాముడు కొలువుదీరాడు.

ఆలయం చరిత్రను పరిశీలిస్తే…

సుమారు రెండువందల ముప్పై సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల కాలంలో శ్రీమతి శీలం జానకి బాయి వంశీయులు విస్తరించినట్టు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.

అంతేకాకుండా కాశీ చరిత్ర అనే పుస్తకంలో ఏనుగుల వీరస్వామి అనే సుప్రీం కోర్టు జడ్జి మద్రాసు నుంచి కాశీయాత్రగా వెళ్తూ 1830 జూలై 22వ తేదీన ఇందల్వాయి ఆలయాన్ని సందర్శించినట్లు కూడా పేర్కొనబడింది. ఈ ఆలయం చుట్టూ 30 మంది బ్రాహ్మణుల అగ్రహారం ఉండేదని పూర్వీకుల ద్వారా తెలుస్తోంది.

దీనిని పరిశీలించిన ఆయన అప్పటి నిజాం నవాబుల ధాటికి తట్టుకుని బురదలో కమలం వలే వికసిస్తున్న ఆలయం అని ఆ కాశీ చరిత్ర పుస్తకంలో పేర్కొన్నట్టు చరిత్ర చదివిన వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ వెలిసిన మూల విగ్రహం ఏడు అడుగుల ఎత్తులో ఉంటూ చుట్టూరా దశావతారాలతో పాటు సీతమ్మ తల్లిని ఒడిలో కూర్చోబెట్టుకుని శ్రీరాముడు ఏకశిలా విగ్రహంగా కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడం విశేషం.

లక్ష్మణుడు లేని దేవాలయం…

ఈ ఆలయంలో సీతా సమేతంగా శ్రీరాముడు హనుమంతుడు ఉండి లక్ష్మణుడు లేని దేవాలయంగా ప్రజల్లోబాగా ప్రాచుర్యం పొందింది.

భారత దేశంలో ఇలాంటి దేవాలయం ఇది ఒక్కటే కావడం మరో విశేషం. తిరుపతి వేంకటేశ్వరస్వామి అందుకుంటున్న పూజల తర్వాత దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు రాజలాంఛనాలతో పాటు విశేష ఆరాధన అందుకుని విరాజిల్లిన ఘనత కూడా ఈ రామాలయానికి ఉందని పండితులు చెబుతున్నారు.

అయోధ్యలో పట్టాభిషేకం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా కొలువుదీరిన మాదిరిగానే ఇక్కడి విగ్రహం కూడా ఉండడం విశేషం.