హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజీనామా చేశారు. తాజా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఆశించిన రాజేంద్రనగర్ సీటు దక్కకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో తనకు మద్ధతుగా ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, డివిజన్ అధ్యక్షులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని కార్తీక్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాదు, మహాకూటమి నుంచి ఎల్.రమణ టికెట్లు అమ్ముకున్నారని కార్తీక్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మహాకుటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ సీటును టీడీపీకి కేటాయించిన సంగతి తెలిసిందే.
మహాకూటమి అభ్యర్థిగా రాజేంద్రనగర్ నుంచి గణేష్ గుప్తాకు టికెట్ లభించింది. అయితే తాను ఎప్పటి నుంచో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నానని, తన అభ్యర్థిత్వం గురించి పరిశీలించాలని పార్టీకి కార్తీక్‌రెడ్డి పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ టికెట్ రాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ?
కార్తీక్ రెడ్డి రాజీనామాతో తల్లి సబితా ఇంద్రారెడ్డి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో అని కాంగ్రెస్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న సబితా ఇంద్రారెడ్డి కుటుంబం నుంచే ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవడం పార్టీకి షాక్ కలిగించింది. అయితే అదే రాజేంద్రనగర్ నుంచే ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచి.. తన సత్తా చాటుకోవాలని కార్తీక్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.