హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి విస్తరించింది.
దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పంటలు చేతికందే సమయంలో కురుస్తున్న ఈ వానలు రైతులను మాత్రం భయపెడుతున్నాయి.
మరోవైపు, ఎండలతో అల్లాడిపోయిన గ్రేటర్ హైదరాబాద్ వాసులు నిన్న కాస్త తెరిపిన పడ్డారు. నిన్న మధ్యాహ్నం వరకు ఎండ సుర్రుమనిపించినా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో 24.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో 40.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.