ఊహించినట్లే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు: నలుగురు టీఆర్ఎస్, ఒకరు ఎంఐఎం

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా ఊహించినట్లుగానే జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు, ఎంఐఎంకు చెందిన ఒకరు ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీలకు 20చొప్పున, ఇదే పార్టీకి చెందిన యెగ్గె మల్లేశం, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియజుల్ హసన్‌లకు 19 చొప్పున ఓట్లు పోలయ్యాయి.

మంగళవారం శాసనసభ కమిటీహాల్-1లో ఉదయం 9గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4గంటలకు ముగిసింది. శశాంక్ గోయల్ ఎన్నికల పరిశీలకునిగా వ్యవహరించారు. కాగా, మొదటి ఓటును స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వేశారు.

సీఎం కేసీఆర్ ఉదయం 11గంటలకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ సభ్యులు 91మంది, మజ్లిస్ నుంచి ఏడుగురు ఓటు వేశారు. అధికారులు ఫలితాన్ని మొదట కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి ఆమోదం వచ్చాక మంగళవారం రాత్రి వెల్లడించారు. ఎన్నికైన ఐదుగురికి ధృవీకరణ పత్రాలు అందజేశారు.

కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీలు

ఆ తర్వాత విజయం సాధించిన ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, మల్లేశంలు సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి శుభాకంక్షలు తెలిపారు. గన్‌పార్క్‌కు వెళ్లి అమరవీరులకు నివాళులర్పించిన ఎమ్మెల్సీలు.. తమకు మద్దతు పలికిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, కాగా, ఈ ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించగా, బీజేపీ ఓటింగ్‌కు దూరంగా ఉంది.

చదవండి: నన్ను చంపుతామంటూ కాల్స్ వస్తున్నాయి: రాజ్‌నాథ్‌కు కిషన్ రెడ్డి ఫిర్యాదు
- Advertisement -