కేటిఆర్‌తో విభేదాలు లేవు, అన్నదమ్ముల్లా పెరిగాం.. ఒకవేళ ఉన్నా…: హరీశ్ రావు

KTR-And-Harish-Rao1
- Advertisement -

KTR-And-Harish-Rao

హైదరాబాద్: ఆపద్దర్మ మంత్రి కేటీఆర్‌కు తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు మరో ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు. అన్నదమ్ముల్లా కలిసి పెరిగిన తాము తెలంగాణ ప్రజల కోసం ఒకే కేబినెట్‌లో పని చేశామన్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.

సిరిసిల్లలో కేటీఆర్‌ని మళ్లీ రికార్డు స్థాయి మెజారిటీతో  గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కేవలం ఒక్క అభివ‌ృద్ధి విషయంలో మాత్రమే తమ ఇరువురి నడుమ పోటీ ఉందని పేర్కొన్నారు.

సిరిసిల్ల, సిద్దిపేట నియోజక వర్గాలు అభివృద్ధి విషయంలో ఒకదానితో మరొకటి పోటీపడి ముందుకు సాగాలని హరీశ్ రావు ఆకాంక్షించారు. తన నియోజకవర్గమైన సిద్ధిపేటలో తనకు వచ్చిన మెజారిటీని ఈసారి సిరిసిల్ల నియోజకవర్గం బద్దలు కొట్టాలంటూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు.

హరీశ్‌తో పోటీ ఎప్పటికీ ఉంటుంది: కేటీఆర్

తాజా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో తెలంగాణ చాలా వేగంగా అభివృద్థి చెందుతోందని, మరోసారి టీఆర్ఎస్‌ పార్టీనే గెలిపించాలని కోరారు.  మరో 15 ఏళ్ళయినా  కేసీఆరే సీఎంగా కొనసాగాలని తాను,  హరీశ్ రావు కోరుకుంటున్నట్లు తెలిపారు.

అందరూ అనుకుంటున్నట్లు  బావ హరీశ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అయితే తమ మధ్య పోటీ ఎప్పటికీ ఉంటుందని, అది కేవలం పాలన, అభివృద్ధి పరంగా మాత్రమేనని స్పష్టం చేశారు.  హరీశ్, తాను సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామన్నారు. హరీశ్ రావుతో ఏ విషయంలో పోటీ పడినా… మోజారిటీ విషయంలో మాత్రం సిద్ధిపేటను దాటలేం అంటూ కేటీఆర్ చమత్కరించారు.

ఉద్యమ కాలం నుంచి హరీశ్‌తోపాటు తాను కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలిసి పని చేశానని కేటీఆర్ చెప్పారు.  తామిద్దరం ఒకే కేబినెట్‌లో కలిసి పని చేస్తామని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఇద్దరం కలిసి ఇలా ఒకే  కేబినెట్‌లో పనిచేసే అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఇచ్చారని వ్యాఖ్యానించారు.  అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్‌కు భారీ విజయం అందించే దిశగా కృషి చేయాలని కేటీఆర్ కార్యకర్తలను కోరారు.

 

- Advertisement -