ఎన్నారై ప్రీతిరెడ్డి దారుణ హత్య: సూట్‌కేసులో మృతదేహం, ప్రమాదంలో మాజీ లవర్..

preethi reddy

మెల్‌బోర్న్‌: గత ఆదివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కనిపించకుండా పోయిన ఎన్నారై డెంటిస్ట్‌ ప్రీతిరెడ్డి(32) దారుణ హత్యకు గురయ్యారు. కత్తితో దాడి చేసి చంపిన దుండగులు ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి సిడ్నీలోని సౌత్‌ వేల్స్‌ ప్రాంతంలో పార్క్‌ చేసి ఉన్న ఆమె కారులోనే వదిలి వెళ్లారు. ఈ మేరకు అక్కడి పోలీసులు వెల్లడించారు. కాగా, ప్రీతిరెడ్డిది తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా. చాలా ఏళ్ల క్రితమే ప్రీతిరెడ్డి కుటుంబం ఆస్త్రేలియాకు వెళ్లి స్థిరపడింది.

రోడ్డు ప్రమాదంలో మాజీ లవర్..

కాగా, ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే అంటే.. బుధవారం ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ హర్షవర్ధన్(34) కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం గమనార్హం. ప్రమాదం జరిగిన తీరు పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు మరణాలకు ఏదైనా సంబంధం ఉండొచ్చనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

సెయింట్‌ లియోనార్డ్స్‌లో జరుగుతున్న ఓ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన ప్రీతిరెడ్డి మళ్లీ కన్పించలేదు. చివరిసారిగా కుటుంబ సభ్యులతో ఆమె ఆదివారం ఉదయం 11గంటలకు మాట్లాతడింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటికి వస్తానని వారికి చెప్పింది.

కానీ, ఎంతకి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలోనూ ప్రీతిరెడ్డి కనిపించడం లేదంటూ.. తెలిసినవారిని సాయం కోరారు.

కాగా, ప్రీతిరెడ్డి అదృశ్యం, హత్య వెనక ఏదో కుట్ర దాగి ఉన్నట్లు భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. చివరిసారిగా మెక్‌‌డోనాల్డ్‌కు ప్రీతి వెళ్లినట్లు గుర్తించారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిస్తే తమకు తెలపాలని స్థానికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రీతిరెడ్డి మరణంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. మంచి స్నేహితురాలిని కోల్పోయామంటూ ప్రీతిరెడ్డి స్నేహితులైన వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: షాకింగ్: అమెరికాలో హైదరాబాద్ యువతి కన్నీటి గాథ! కాలికి జీపీఎస్ ట్రాకర్ కట్టి, అమెరికా…