హైదరాబాద్: ఒమన్ దేశంలో తన కూతురు నరకం అనుభవిస్తోందని, ఆమెను ఎలాగైనా కాపాడి స్వదేశానికి తీసుకురావాలని హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ.. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. ఉద్యోగం నిమిత్తం ఒమన్ వెళ్లిన తన కుమార్తెను అక్కడి చిత్ర హింసలు పెడుతున్నారని, కనీసం ఆహారం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘షహీదా బేగం అనే మధ్యవర్తి ఉద్యోగం ఇప్పిస్తానంటూ మమ్మల్ని సంప్రదించింది. నెలకు రూ.25 వేల వరకు జీతం ఇస్తారని నమ్మబలికింది. ఆమెపై నమ్మకంతో నా కుమార్తెను గత డిసెంబరు 9న ఒమన్‌కు పంపాను’ అని బాధితురాలి తల్లి రషీదా బేగం తెలిపింది.
‘‘మీరే కాపాడాలి..’’
అంతేగాక, ‘అక్కడి(ఒమన్)కి చేరుకున్న తరవాత ఆమెను ఓ కార్యాలయంలో బంధించారు. అనుమతి లేకుండానే అనేక ప్రాంతాలకు తరలిస్తున్నారు. కనీసం సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదు. దీనిపై మధ్యవర్తి షహీదాను సంప్రదించగా రూ.2 లక్షలు డిమాండ్ చేస్తోంది..’ అని రషీదా బేగం ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు నరకం అనుభవిస్తోందని, వీలైనంత త్వరగా మధ్యవర్తుల చెర నుంచి విడిపించాలంటూ సుష్మా స్వరాజ్‌ను కోరారు రషీదా బేగం.