హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో బుధవారం ఉదయం నుండి పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. వర్షపు నీరు కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివాసముండే ప్రజలు.. ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
బాషీర్‌బాగ్, కోఠీ, అబిడ్స్. దిల్‌సుఖ్‌నగర్, కొంపల్లి, షాపూర్, కుత్బుల్లాపూర్, ఐడీపీఎల్, రాజేంద్రనగర్, శంషాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మియాపూర్, చందానగర్, జీడిమెట్ల, సుచిత్ర, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్‌ఆర్ నగర్, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
పలుచోట్ల ట్రాపిక్ జామ్…
మరోవైపు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాపిక్ జామ్ అయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, డిజాస్టర్ మెనేజ్ మెంట్ బృందాలు అప్రమత్తమయ్యారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలపై వెంటనే స్పందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఆదేశించారు.
విషాదం…
ఇదిలావుండగా, ఈ వర్షపు నీటిలో కొట్టుకుపోయి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. బోరబండ సాయిబాబా గుడి వద్ద వర్షపు నీరు చేరి.. ఉదృతంగా ప్రవహిస్తున్న నాలాలో కొట్టుకుపోయి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.