మేఘన ట్రావెల్స్ బస్సులో మంటలు.. 60 మంది ప్రయాణికులు సేఫ్!

6:58 am, Tue, 13 August 19

హైదరాబాద్: కూకట్‌పల్లిలో పెను ప్రమాదం తప్పింది. మియాపూర్ నుంచి తిరుపతి బయలుదేరిన మేఘన ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కూకట్‌పల్లి బస్సు డిపో వద్దకు రాగానే బస్సులోని ఏసీ వద్ద మంటలు చెలరేగాయి. వాటిని చూసిన కొందరు భయంతో డ్రైవర్‌కు చెప్పారు.

అతడు వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను కిందికి దించేశాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారొచ్చి మంటలను అదుపు చేశారు. బస్సులోని 60 మంది ముందే బస్సు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.