హైదరాబాద్: మహాకుటమిలోని కాంగ్రెస్ పార్టీకి సీపీఐ షాకిచ్చింది. సీట్ల సర్దుబాటులో టీ-కాంగ్రెస్ విపరీత జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ.. ఆ పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ పోయబోయే స్థానాలను కూడా ప్రకటించేసింది. ఈ మేరకు 9 అసెంబ్లీ స్థానాల వివరాలను సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు.
చదవండి: ఇంతకన్నాఎక్కువ ఇవ్వలేం: మహాకూటమి సీట్ల కేటాయింపుపై చేతులెత్తేసిన కాంగ్రెస్!
సోమవారం హైద్రాబాద్‌లోని తమ పార్టీ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి బలం ఉన్న సీట్లనే తాము కోరుతున్నట్టు చెప్పారు. ఇవాల్టి వరకు కూడా టీ-కాంగ్రెస్ పార్టీ నుండి తమకు సానుకూలమైన సంకేతాలు రాలేదన్నారు.
తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్లాన్-ఎ ప్రకారంగా సీపీఐ పోటీ చేసే స్థానాల వివరాలను ప్రకటించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఆలస్యం చేస్తే మరో రెండు మూడు రోజుల్లో తమ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నట్టు చాడ వెంకటరెడ్డి ప్రకటించారు.
సీపీఐ 9 అసెంబ్లీ స్థానాలలో పోటీ..
ప్లాన్-ఎ ప్రకారంగా తాము పోటీ చేసే స్థానాల వివరాలను ప్రకటిస్తున్నామని, ఈ మేరకు ఆయా సీట్ల వివరాలను కూడా తమ భాగస్వామ్య పక్షాలకు తెలియజేశామని ఆయన పేర్కొన్నారు.
తాము కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి, ఆలేరు, మునుగోడు, మంచిర్యాల, దేవరకొండ, పినపాక మొదలైన స్థానాలు కోరినట్టు చాడ వెంకట్ రెడ్డి చెప్పారు.
ఈ స్థానాల విషయమై కాంగ్రెస్ పార్టీ నుండి సానుకూల సంకేతాలు వస్తే సర్దుబాటుకు సిద్దంగా ఉన్నామన్నారు. అయితే మహాకూటమిలో కొన్నిఇబ్బందులున్నాయని చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుండి సానుకూలంగా స్పందనలు రాకపోతే రెండు మూడు రోజుల్లో ఈ స్థానాలలో అభ్యర్థులను కూడా ప్రకటించనున్నట్టు ఆయన తేల్చి చెప్పారు.
మరో 20 స్థానాల్లో కూడ అభ్యర్థులను ప్రకటిస్తాం..
అప్పటికీ టీ-కాంగ్రెస్ దిగి రాకపోతే.. ప్లాన్-బి అమలు చేస్తామని, అందులో భాగంగా మరో 20 స్థానాల్లో కూడ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని.. తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అనుకొన్నట్టుగా ప్లాన్-బి అమలు చేస్తామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. తమకు బలం ఉన్న చోటే పోటీ చేయాలని తమ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.