ఖమ్మం: ఇద్దరు విద్యార్థుల మధ్య మొబైల్ ఫోన్ కోసం ఘర్షణ జరిగి.. ఒకరి మరణానికి దారి తీసింది. నాలుగో తరగతి చదివే జోసెఫ్ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. అది పదో తరగతి చదివే హరనాథ్ చూశాడు. ఒకసారి ఫోన్ ఇవ్వమని అడిగాడు. జోసెఫ్ ఇవ్వననడంతో.. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో.. జోసెఫ్ (10) మరణించాడు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్టీ వసతి గృహంలో మంగళవారం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. దసరా సెలవుల నుంచి హాస్టల్‌కు తిరిగొచ్చిన రోజే విషాదం చోటుచేసుకోవడంతో అ హాస్టల్‌లో విషాదం నెలకొంది.
ఖమ్మం పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ జి.వెంకటరావు కథనం ప్రకారం.. ఖమ్మంలోని ఖానాపురానికి చెందిన జోసెఫ్ స్థానికంగా రేవతి సెంటర్ సమీపంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అదే హాస్టల్‌లో ఉంటూ దగ్గరలోని రిక్కాబజార్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హరనాథ్‌కి.. జోసెఫ్‌కి మాటామాటా పెరిగింది.
దీంతో హరనాథ్ తన టవల్‌తో జోసెఫ్ మెడ చుట్టూ బిగించి ఊపిరాడకుండా చేశాడు. అనంతరం అతడి తలను ట్రంకు పెట్టెకేసి బలంగా బాదాడు. మరికొందరు విద్యార్థులతో కలిసి జోసెఫను తీవ్రంగా కొట్టడం కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరువాత జోసెఫ్ మృతదేహాన్ని అతడి గదిలోని ఓ ట్రంకుపెట్టెలో కుక్కి అక్కడి నుంచి వాళ్లు వెళ్లిపోయారు.
సాయంత్రం 5 గంటలకు జోసెఫ్‌తో పాటు ఉండే విద్యార్థులు గదిలోకి వచ్చి ట్రంకుపెట్టెను సర్దే క్రమంలో.. అందులో అతడి మృతదేహం కనిపించింది. వెంటనే ఆ విద్యార్థులు విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు, ప్రధానోపాధ్యాయుడికి తెలియజేశారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఖమ్మం టూటౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ హాస్టల్‌కు వెళ్లి.. వార్డెన్ ప్రతాప్‌సింగ్, ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావును విచారించారు.
జోసెఫ్ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అతడి మెడ ఎముక విరిగింది. జోసెఫ్‌ను కొట్టే క్రమంలో అతడిని ట్రంకుపెట్టెలో కుక్కి.. దానిపైన కూర్చోవడం వల్లే అతడు మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. జోసెఫ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
జరిగిన దారుణానికి కారకుడిగా భావిస్తున్న పదో తరగతి విద్యార్థి హరనాథ్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. హరనాథ్ కోపిష్టి అని తెలియవస్తోంది. ప్రతి చిన్న విషయనికి అందరి మీద కోపం తెచ్చుకుంటాడని..ఆ కోపంలోనే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ సినిమాల్లో.. అతి భయంకరంగా కొట్టడం హీరోయిజంగా మారిన నేపథ్యంలో.. అదే రీతిలో కొట్టి ఉంటాడని..పోలీసులు అనుమానిస్తున్నారు.
మొబైల్ ఫోన్.. పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తల్లిదండ్రులు గమనించాలని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొంటున్నారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇతర విద్యార్థులను విచారించి ప్రాథమిక వివరాలు సేకరించారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలించిన ఏసీపీ వెంకట్రావు, టూటౌన్ సీఐ నరేందర్.. జోసఫ్‌తో మరో విద్యార్థి కూడా కలిసి తిరిగినట్లుగా ఉన్న ఫుటేజీని గుర్తించారు.
జోసఫ్ తండ్రి రెక్కాడితే డొక్కాడని రోజు కూలీ, తల్లి మూగ మహిళ. జోసఫ్ హత్యకు గురవడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. ఈ బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కొడుకు చనిపోవడానికి వసతి గృహం అధికారుల బాధ్యతా రాహిత్యమే కారణమంటూ వారు ఆందోళనకు దిగారు.