టీ-టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ.. ఎన్నికల వ్యూహాలు, ప్రచారంపై శ్రేణులకు దిశానిర్దేశం…

Chandrababu Naidu5
- Advertisement -

Chandrababu Naidu5

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ భవన్‌లో సోమవారం పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు.  తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన వారితో చర్చించారు.

తెలంగాణ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ముఖ్య నేతలకు అధినేత దిశానిర్దేశం చేశారు. ప్రజాకూటమిలో పొత్తులు, సీట్ల పంపకాలపై ఇప్పటివరకు ఇతర పార్టీలతో జరిపిన చర్చలను చంద్రబాబుకు టీ-టీడీపీ అధ్యక్షుడు రమణ వివరించారు.

టీ-టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో పోటీ…

అలాగే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆదివారం కొన్ని స్థానాల నేతల అనుచరులు తమ నేతలకే టికెట్లు ఇవ్వాలంటూ చంద్రబాబు నివాసం వద్ద ప్రదర్శన జరిపారు.

తెలుగుదేశం పార్టీకి 30 సీట్లు కావాలంటూ గతంలో కాంగ్రెస్‌కు రాష్ట్ర నేతలను కోరగా.. అందుకు కాంగ్రెస్ ఒప్పుకోలేదు. మరోవైపు అడిగిన సీట్లలో సగమే ఇవ్వడానికి ఆ పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా టీడీపీ అడిగిన స్థానాల్లో కాకుండా కొన్ని ఇతర చోట్ల ఇస్తామని కూడా కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.  ఈ నేపథ్యంలో టీ-టీడీపీ బలంగా ఉన్న సీట్లు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు.

సీట్ల కన్నా.. పొత్తులు ముఖ్యం…

సోమవారం టీడపీ శ్రేణుల సమావేశంలో కూడా చంద్రబాబు మాట్లాడుతూ  ప్రస్తుతం సీట్ల కన్నా పొత్తులు ముఖ్యమని వ్యాఖ్యానించారు.  సీట్ల విషయంలో సర్దుకుపోవాలని సూచించారు. తెలంగాణలో ఏర్పడే కూటమి జాతీయస్థాయిలో ప్రభావం చూపుతుందని బాబు పేర్కొన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ టీ-టీడీపీకి 12 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని.. మరో 6 సీట్లు కావాలని అడుగుదామని చంద్రబాబు చెప్పారు.  సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌ పార్టీ పెద్దలతో తను మాట్లాడుతానని పార్టీ నేతలకు ఆయన భరోసా ఇచ్చారు.

టిక్కెట్ రాలేదనే అసంతృప్తి వద్దు…

అలాగే తెలంగాణలో మహాకూటమి గెలుపునకు టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడాలని తెలియజేశారు. ఇప్పుడు టికెట్ రాని వారు అసంతృప్తి చెందవద్దని,  మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తానని.. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రత్యామ్నాయ పదవులు ఇస్తామని ఆయన చెప్పారు.

మరోవైపు హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్ స్థానాలు  టీడీపీకేనంటూ చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్ స్థానాల కోసం కాంగ్రెస్‌తో మాట్లాడుతానని టీడీపీ నేతలకు బాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.  అలాగే శేరిలింగంపల్లి స్థానాన్ని భవ్య సిమెంట్స్ ఆనందప్రసాద్‌కు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రచార పర్వంలో చంద్రబాబు కూడా…

అభ్యర్థులు ఖరారైన తర్వాత రాష్ట్రంలో టీ-టీడీపీ తరఫున ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’ కూటమి నిర్వహించే సభల్లో చంద్రబాబు సైతం పాల్గొని ప్రచారం చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు.  ఈ మేరకు ప్రచారం ప్రారంభించేందుకు కూడా టీ-టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు.  టీ-టీడీపీ తరపున భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

 

 

 

- Advertisement -