దూకుడు పెంచిన బీజేపీ.. టార్గెట్ ‘తెలంగాణ’

1:16 pm, Sun, 11 August 19

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా తెలంగాణను లక్ష్యంగా చేసుకుంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా బలమైన నాయకులను తమ పార్టీలోకి తీసుకురావాలని యోచిస్తోంది.

తొలుత తెలంగాణలోని టీడీపీ నేతలకు గాలం వేస్తోంది. రాష్ట్రంలో బలహీనంగా ఉన్న టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది. కేసీఆర్ దెబ్బకు తెలంగాణలో టీడీపీ కునారిల్లింది. పార్టీలోని ముఖ్యనేతలను టీఆర్ఎస్‌లోకి తీసుకురావడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పటికీ కొంతమంది టీడీపీ నేతలు, ఆ పార్టీకి దూరమైన మాజీ నాయకులు రాజకీయాల్లో సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిపై బీజేపీ ఫోకస్ చేసింది.

ఈ క్రమంలోనే టీడీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్న మోత్కుపల్లి నర్సింహులును కలిసి పార్టీలో చేరాలని కోరారు. ఆయనతోపాటు తెలంగాణలో టీడీపీకి చెందిన మరికొంతమంది నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించడంపై బీజేపీ దృష్టి పెట్టింది. టీఆర్ఎస్ సహా ఇతర పార్టీల్లో చేరిన టీడీపీ నేతల్లో అసంతృప్తులను గుర్తించే పనిలో పడింది. వారిని బీజేపీలోకి రప్పిస్తే వారి ద్వారా బలమైన క్యాడర్ కూడా బీజేపీలోకి వస్తుందని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు.