బిగ్ డీల్: రూ.1600 కోట్లకు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మకం!

Oakridge-International-School-Sold-Away, newsxpress.online

oakridge-international-school

హైదరాబాద్: దేశంలోని టాప్ క్లాస్ ప్రైవేట్ స్కూల్స్‌లో ఒకటిగా పేరొందింది ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్. అయితే ఈ స్కూల్ యాజమాన్యం మారినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.

హైదరాబాద్‌లో బిగ్ షాట్స్, సెలబ్రిటీల పిల్లలు చదివే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రస్తుతం విశాఖపట్నం, బెంగళూరు మొహాలీలో కూడా క్యాంపస్‌లు నిర్వహిస్తోంది. తాజాగా ఈ ఇంటర్నేషనల్ స్కూల్‌ను హాంకాంగ్‌ కేంద్రంగా నడుస్తున్న విద్యా సంస్థ నోర్డ్ ఏంజిలియా ఎడ్యుకేషన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ మన తెలుగువాళ్లు స్థాపించినదే. పీపుల్ కంబైన్ అనే సంస్థ పేరుతో ప్రసాద్ తుమ్మల, వైవి రాజశేఖర్ అనే వ్యక్తులు ఈ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. వీరిద్దరూ ఎస్‌బీలో చదివి టాప్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగారు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

గత రెండు దశాబ్దాలుగా నాణ్యమైన విద్యాబోధన జరుపుతూ ఉన్నతాదాయ వర్గాల్లో మంచి పేరు సంపాదించిన ఓక్రిడ్జ్‌కు అదే స్థాయిలో బ్రాండ్‌ కూడా ఉంది. ఓక్రిడ్జ్‌‌కు దేశవ్యాప్తంగా మొత్తం ఐదు స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 7000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఇక నోర్డ్ ఏంజిలా ఎడ్యుకేషన్ పరం…

హాంకాంగ్‌ కేంద్రంగా నడుస్తున్న విద్యా సంస్థ నోర్డ్ ఏంజిలియా ఎడ్యుకేషన్ సంస్థ.. ఓక్రిడ్జ్‌ను రూ.1500-1600 కోట్లు వెచ్చించి తన స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారికంగా స్పందించేందుకు అటు నోర్డ్ ఏంజిలియా ఎడ్యుకేషన్‌గాని.. ఇటు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్‌గాని నిరాకరించినప్పటికీ యాజమాన్య మార్పు జరిగిందనే విషయాన్ని మాత్రం ధ్రువీకరిస్తున్నాయి.

నోర్డ్ ఏంజిలియా ఫ్యామిలీ గ్రూప్‌నకు 30 దేశాల్లో 60 ప్రీమియర్ కె-12 స్కూల్స్ ఉన్నాయి. ఇవి సుమారు 60 వేల మంది విద్యార్థులకు ఉన్నత స్థాయిలో విద్యను అందిస్తున్నాయి. నోర్డ్ సంస్థను బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, కెనెడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

ఎడ్యుకేషన్‌ సెక్టార్‌లో టాప్ డీల్…

ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూలు కొనుగోలు.. హైదరాబాద్ ఎడ్యుకేషన్ రంగంలోనే టాప్ డీల్ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో పలు విదేశీ సంస్థలు పోటీలుపడి అనేక వైద్య సంస్థలను కొనుగోలు చేశాయి కానీ స్కూల్ విద్యలో మాత్రం ఇలా అంతర్జాతీయ స్థాయి సంస్థలు కొనుగోలు చేసిన దాఖలాలు లేవు.

అసలు హైదరాబాద్‌లో ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌కు రూ.1500-1600 కోట్ల విలువ రావడాన్ని చూసి స్థానిక వ్యాపార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ బిగ్ డీల్ కొన్ని వారాల క్రితమే కుదిరినప్పటికీ.. ఈ వ్యవహారం విసిసి సర్కిల్ ద్వారా ఇప్పుడు అధికారికంగా బయటపడింది. అయితే పాత యాజమాన్యం పూర్తిగా వైదొలుగుతుందా లేక వాళ్ల నేతృత్వంలోనే ఇతర ప్రాంతాల్లోనూ ఓక్రిడ్జ్ విస్తరణ కొనసాగుతుందా? అనే అంశంపై ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది.